నాంపల్లి కోర్టులు, జనగామ జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న డీసీపీ రాధాకిషన్‌రావుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి పొట్లపల్లి సరోజనాదేవి (99) సోమవారం కరీంనగర్‌లోని కుమార్తె ఇంట్లో అనారోగ్యంతో మృతిచెందింది. రాధాకిషన్‌రావు స్వగ్రామం జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లగుట్టలోని ఇంటికి ఆమె భౌతికకాయాన్ని సోమవారం సాయంత్రం తరలించారు.
అయితే తల్లి మరణవార్త తెలుసుకున్న రాధాకిషన్‌రావు కడసారి చూపులకు అనుమతించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రెండు రోజులు అనుమతిస్తూ సోమవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 14 రోజుల పాటు అనుమతివ్వాలని నిందితుడి తరఫున పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తోసిపుచ్చింది. సోమవారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు తల్లి అంత్యక్రియలు పూర్తి చేసుకొనేలా కోర్టు ఉత్తర్వులో పేర్కొన్నది