నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 15 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడుగా ఉన్న ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్‌కుమార్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో అధికారులు కీలక అంశాలను వెల్లడించారు. రూ. 6,58,47,883.81 డబ్బును ఆఖండ్ ఇన్ఫ్రాటెక్ ఇండియాకు చెల్లించకుండా, ఇనుప ఖనిజాన్ని కూడా ఇవ్వకుండా తమ కంపెనీని శ్రావణ్ మోసం చేశాడని ఏ ఆకర్ష్కృష్ణ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో శ్రావణ్‌కుమార్‌ను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చగా 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తూ 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీచేశారు.
ఈ కేసులో ఉన్న మిగతా నిందితులు అకోర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి, కంపెనీ ప్రతినిధి కేబీ వేదమూర్తి, శ్రావణ్ భార్య అరువేల స్వాతి, అకోర్ ఇన్‌రిథమ్ ఎనర్జీ కంపెనీలకు చెందిన వ్యక్తులు పరారీలో ఉన్నట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. త్వరలో వారిని కూడా అదుపులోకి తీసుకోనున్నట్టు పోలీసులు వివరించారు. ఆర్థిక నేరాల్ని తీవ్రంగా పరిగణించాలని, నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయని అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.