హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఆ ఎండీ చాంబర్లోకి అడుగు పెట్టాలంటే ముందు ఆ రూల్ గురించి తెలియాల్సిందే.. బయట గోడలపై వేలాడుతున్న రెండు స్టిక్కర్లపై ఉన్న మ్యాటర్‌ను చదవాల్సిందే.. ఆ రూల్ ప్రకారమైతేనే లోనికి అనుమతి.. కాదు, కూడదు.. అంటే నో పర్మిషన్.. ఇదీ తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్ఐడీసీ) ఎండీ కార్యాలయంలో అమలవుతున్న వివాదాస్పదన నిబంధన. రాష్ట్రంలో ఏ స్థాయి ప్రభుత్వ ప్రతినిధికీ, ఐఏఎస్ అధికారులకూ లేని నిబంధన ఇక్కడ అమలవుతున్నది.
టీజీఎంఎస్ఐడీసీ ఎండీ చాంబర్లోకి విజిటర్లు, ఆఫీసర్లతోపాటు మీడియాప్రతినిధుల ఫోన్ల నూ అనుమతించడం లేదు. ఏకంగా ఓ వ్యక్తి కూర్చొని ఫోన్లను ఆఫీస్ చాంబర్ బయటే కౌంటర్ ఏర్పాటుచేసి మరి డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఫోన్లు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్లేది లేదని తేల్చిచెప్తున్నారు. ఏకంగా ‘నో మొబైల్ ఫోన్స్ అలౌడ్’, ‘మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ది ఎండీ చాం బర్’ అని రెండు నోటీస్ స్టిక్కర్లను అతికించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గతంలో టీజీఎంఎస్ఐడీసీ ఎండీగా పనిచేసి వెళ్లిన ఓ అధికారి ఈ నిబంధనను అమలుచేశారు.
ఇటీవల సంస్థ కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అధికారి సైతం అదే నిబంధనను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ విచిత్ర రూల్‌ను చూసి సొంత శాఖ ఉద్యోగులు, అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో ఎండీలుగా పనిచేసి ఏ ఒక్క రూ ఇలాంటి నిబంధన పెట్టలేదని, ఇప్పుడు కొత్తగా ఈ రూల్ ఏమిటని మండిపడుతున్నారు. అసలు ఎండీ చాంబర్లో ఎందుకు ఈ నిబంధన తీసుకొచ్చారనే చర్చ అధికార వర్గాల్లోనూ జోరుగా సాగుతున్నది. గతంలో ఈ శాఖలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అధికారులు కమీషన్లు పొందుతున్నట్టు ఆఫ్ ది రికార్డులో కార్యాలయ ఉద్యోగులే చెప్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా కమీషన్లు కొట్టేందుకు అధికారులు ప్రయత్నించినట్టు తెలుస్తున్నది. అయితే కార్యాలయంలో నే ఈ ఒప్పందాలు జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. అందుకే మొబైల్ ఫోన్లను ఎండీ చాంబర్లోకి అనుమతించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.