హైదరాబాద్, డిసెంబర్ 30: నాసిరకం దగ్గుమందు సరఫరా చేసి ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారుల మృతికి కారణమైందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన మారియన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ది ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మ్‌ఎక్స్‌సిల్) ప్రకటించింది.
కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మారియన్ సంస్థ ఎగుమతి చేసిన దగ్గుమందు తీసుకున్న 18 మంది చిన్నారులు మృతి చెందినట్టు ఉజ్బెకిస్థాన్ ఆరోపించిన నేపథ్యంలో దీనిపై ఫార్మ్‌ఎక్స్‌సిల్ వివరణ అడిగింది. అయితే తాము నిర్దేశించిన గడువు డిసెంబర్ 29లోగా సమాధానం చెప్పడంలో మారియన్ కంపెనీ విఫలం కావడంతో దాని సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. మారియన్ కంపెనీ చర్య కారణంగా భారత్ ఔషధ రంగం పేరు ప్రతిష్టలు దిగజారే ప్రమాదం ఉందని ఫార్మా ఎగుమతి సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.