ఖైరతాబాద్, నవంబర్ 17: గిరిజనుల బతుకులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా విషం చిమ్మే కుట్రలుచేస్తోందని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లగచర్ల ఫార్మా బాధితులకు మద్దతుగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గ్రీన్‌ఫీల్డ్ కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం 1358 ఎకరాల భూ సేకరణ చేపడుతుందని, అందులో 721ఎకరాల పట్టా భూములు కోల్పోవడంతో 4వేల మంది గిరిజనులు రోడ్డునపడుతారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రజా ప్రభుత్వమని చెప్పుకొని గిరిజనుల భూములు గుంజుకుంటూ వారిపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి తప్పుచేశామని గిరిజనులు భావిస్తున్నారని, లగచర్ల బాధితులకు న్యాయం చేయాలని సోమవారం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌కు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు.
బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేవరకు చలో లగచర్ల నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పారు. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రఘురాం రాథోడ్, ప్రధాన కార్యదర్శి రేఖానాయక్, ఉపాధ్యక్షులు పత్లావత్ రవినాయక్, గుగులోతు రవినాయక్, రఘు సునీతాబాయి, రవీందర్‌నాయక్, మోతీలాల్‌నాయక్, పండరీ నాథ్ నాయక్, అభినాయక్ పాల్గొన్నారు.