ఓవైపు నిర్బంధ భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కాలుదువ్వుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ బతుకుదెరువైన భూములను వదులుకునేది లేదని బాధిత రైతులు తెగేసి చెప్తున్నారు. ‘ప్రాణాలైనా ఇస్తాంగాని.. భూములిచ్చేది లేదని తేల్చిచెప్తున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఫార్మా వ్యతిరేక పోరాట సమితి రైతులు శనివారం దీక్షకు దిగారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వబోమని కాట్రేవుపల్లి రైతులు భూ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ ప్రాజెక్టు కట్ట మీది నుంచి కదలబోమని శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామం నర్సిరెడ్డిగూడెం భూ నిర్వాసితులు మూడో రోజూ పథకం పనులను అడ్డుకున్నారు.
Telangana | రంగారెడ్డి, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా ఫార్మా వ్యతిరేక పోరాట సమితి రైతులు వెనకడుగు వేయలేదు. పోలీసు వలయాన్ని ఛేదించుకొని మరీ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ‘మా భూములు మాకు వదిలేయండి’ అంటూ నినదించారు. ఇచ్చినహామీని నిలబెట్టుకోకుండా కాంగ్రెస్సర్కారు తమను మోసం చేస్తున్నదని ఆగ్ర హం వ్యక్తంచేశారు. అన్నదాతలు భారీగా కదలిరావడంతో స్థానిక కాంగ్రెస్‌నేతలు వారి అడుగులో అడు గువేయక తప్పలేదు. ‘సీఎం డౌన్‌డౌన్’ అంటూ నినదిస్తూ నిరసనలో వారూ పాల్గొనాల్సి వచ్చింది.
బారికేడ్లను దాటుకొని నిరసనలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన రైతులు మరోసారి తమ ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఫార్మాసిటీ కోసం ఇచ్చిన భూములను తిరిగి ఇచ్చేయాలంటూ కొంత కాలంగా రైతులు నిరసన తెలుపుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భూసేకరణకు సంబంధించి అభ్యంతరాలను తెలపాలంటూ ఇటీవల రెవెన్యూ అధికారులు రైతులకు నోటీసులు జారీచేశారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టర్‌తో సమావేశమయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. దీంతో శనివారం ఉదయం రైతులు పెద్దఎత్తున కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తొలుత 250 మంది బాధిత రైతులు మేడిపల్లిలోని ఫార్మా వ్యతిరేక పోరాట సమితి స్థూపానికి పూలమాలలు వేసి, నల్లజెండాను ఆవిష్కరించారు. ఫార్మాసిటిని రద్దు చేయాలని నినాదాలు చేశారు. రైతులు భారీఎత్తున వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు యాచారం రహదారితో పాటు ఇబ్రహీంపట్నం వద్ద అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. సమాచారమందుకున్న రైతులు గ్రూపులుగా విడిపోయి గ్రామాల్లోని లింకు రోడ్ల ద్వా రా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో ప్రధానగేటు ముందు బైఠాయించారు.
నోటీసులిచ్చి.. వాయిదా వేసి
ఫార్మా బాధిత రైతులను శనివారం రావాల్సిందిగా అధికారులే నోటీసులు ఇవ్వగా.. తీరా సమయానికి కలెక్టర్ కార్యాలయానికి రాలేదు. పోలీసుల సూచనల మేరకు ఆయన సమావేశానికి దూరంగా ఉన్నారని సమాచారం. వందల మంది రైతులు వచ్చారని, వారంతా తాము భూములు ఇవ్వబోమని చెబితే సంచలనంగా మారుతుందని, లగచర్ల తరహాలో ఉద్రిక్తతకు దారితీసే అవకాశాలూ లేకపోలేదని పోలీసులు కలెక్టర్కుసూచించినట్టు తెలిసింది.
రేవంత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల నినాదాలు
ఫార్మాసిటీ భూములను తిరిగి రైతులకు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట తప్పడంతో స్థానిక నాయకులు ఇరకాటంలో పడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం అయినప్పటికీ యాచారం మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, నానక్‌నగర్ మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ ఎస్టీ మోర్చా నేత అర్వింద్‌కుమార్ తదితరులు ధర్నాలో పాల్గొనాల్సి వచ్చింది. సీఎంతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న రైతులతో గొంతు కలపాల్సి వచ్చింది.