వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 19: పీజీ సీట్ల కౌన్సెలింగ్‌లో బోగస్ అభ్యర్థులను సృష్టించి, సీట్లను మిగుల్చుకొని యాజమాన్య కోటాలో అమ్మకానికి యత్నించిన కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల గుట్టును కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు రట్టు చేశారు. మంగళవారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ వివరాల ప్రకారం.. నీట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాలో బోగస్‌లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు ముందుగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం అన్ని కౌన్సెలింగ్‌లు పూర్తయ్యే సమయానికి సీట్లు మిగిలితే, వాటిని కళాశాలలు సొంతంగా భర్తీ చేసుకోవడానికి గతంలో ప్రభు త్వం ఉత్తర్వులిచ్చింది. ఈ లొసుగులు ఆసరాగా కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఇతర రాష్ర్టాలకు చెందిన అభ్యర్థుల వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించి, ఆ తరువాత కౌన్సెలింగ్‌లో సీట్లను భర్తీ చేసి, అడ్మిషన్ తీసుకోకుండా ఖాళీగా ఉంచుతున్నాయి.
దీన్ని ఉపయోగించి యాజమాన్య కోటా సీట్లను బ్లాక్ చేయడానికి యత్నిస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. కరోనా కారణంగా ఆన్లైన్ విధానంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్న అధికారులకు సుమారు 50 మంది అభ్యర్థుల వివరాల్లో తేడా ఉండటంతో అనుమానాలు మొదలయ్యాయి. మరింత సమాచారం అందించాలంటూ అభ్యర్థులను కోరడంతో, సుమారు 10 మంది అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకోలేదని సమాధానం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. నీట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలతో బోగస్ రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకొన్నట్టు అనుమానాలు బలపడటంతో సదరు అభ్యర్థులను గుర్తించడానికి దర్యాప్తు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.