న్యూఢిల్లీ, మార్చి 25: దేశంలో ఎల్పీజీ సంక్షోభం సద్దుమణగకముందే పెట్రో సంక్షోభం చుట్టుముట్టింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు బంకుల ముందు బారులు తీరుతున్నారు. ఎక్కడ చూసినా భారీ క్యూలు కనిపిస్తున్నాయి. కొరత లేదని ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సూరత్ వరకు అనేక నగరాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే కేంద్రం, అధికారులు యథావిధిగా పాత పాటే మొదలు పెట్టారు. ‘నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదు’ అని ప్రకటించారు. ఇప్పటికే ఎల్పీజీ కొరత కారణంగా ఏజెన్సీల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. ఇప్పుడు పెట్రో సంక్షోభం కూడా తలెత్తడంతో సామాన్యుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
నో స్టాక్ బోర్డులు
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారుల బారులు, అక్కడ ఏర్పడుతున్న గందరగోళం, గొడవల చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, జబల్పూర్, సూరత్, అహ్మదాబాద్, కచ్, చండీగఢ్, జలంధర్, మీర్జాపూర్, రాజ్‌కోట్, నాగ్‌పూర్, ఇండోర్ తదితర నగరాల్లో ఇలాంటి దృశ్యాలే కన్పిస్తున్నాయి. . ‘దేశంలో గ్యాస్‌కు కొరత లేదని అన్నారు. అది నమ్మాను. అయితే గ్యాస్ బుక్ చేసి 15 రోజులైనా ఇంతవరకు సిలిండర్ రాలేదు. చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయంటే నిజమే కావొచ్చు అనుకున్నా. మంగళవారం మధ్యాహ్నం మా ప్రాంతంలోని పెట్రోల్ బంక్‌ల్లో హఠాత్తుగా నో స్టాక్ బోర్డులు వెలిశాయి. దీంతో 20 కి.మీ దూరంలోని మరో బంక్‌కు వెళ్లి మూడు గంటలు నిల్చుని పెట్రోల్ పోయంచుకున్నా’ అని ఒక యూజర్ తన అనుభవాన్ని పోస్ట్ చేశాడు.

అంతా క్యాష్ అండ్ క్యారీయే…
హఠాత్తుగా చమురు కొరత ఏర్పడటానికి ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కూడా కారణమని ఫెడరేషన్ ఆఫ్ గుజరాత్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్జీపీడీఏ) అధ్యక్షుడు మెహెల్ పటేల్ తెలిపారు. ఇంతకాలం వరకు ఈ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు డీలర్లకు అప్పుపై చమురు సరఫరా చేసేవని పేర్కొన్నారు. ఉదాహరణకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐదు రోజులు, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) 2-3 రోజులు అరువుపై చమురును సరఫరా చేసేవి. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల్లో చెల్లింపు వ్యవస్థను మార్చేశాయి. క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని ప్రవేశపెట్టాయి. సొమ్ము కొట్టు.. సరుకు కొట్టు విధానం హఠాత్తుగా ప్రవేశపెట్టడంతో డీలర్లకు నగదు సర్దుబాటు కాక తీవ్ర గందరగోళంలో పడ్డారు. దీంతో చమురు అయిపోయినా వెంటనే తెప్పించేందుకు నగదు సర్దుబాటు కాక ఇబ్బందులు పడుతున్నారు.
గుజరాత్లో అదే సీన్
గుజరాత్లో వాహనదారుల్లో చమురుపై తీవ్ర ఆందోళన సోమవారం నుంచే ప్రారంభమైంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో చాలావరకు పెట్రోల్ బంకులు మూతపడటంతో పౌరులు ఆందోళనతో ఉన్న బంక్‌ల వద్దకు భారీగా చేరుకున్నారు. సూరత్ నుంచి అహ్మదాబాద్, వడోదర నుంచి రాజ్‌కోట్ వరకు పెద్దయెత్తున వాహనదారులు బారులు తీరిన దృశ్యాలే కన్పిస్తున్నాయి. అయితే యథా ప్రకారం రాష్ట్రంలో ఏ పెట్రోల్ బంక్ మూతపడలేదని, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయంటూ గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ ఒక ప్రకటన చేసి చేతులు దులిపేసుకున్నారు. అయితే పరిశ్రమలోని వర్గాలు భిన్న కథనాలు విన్పిస్తున్నాయి. బల్క్ ఇంధన ధరలు రూ. 12 నుంచి 22 వరకు పెరగడంతో కొనుగోలు విధానాలను మార్చారని, దీంతో పారిశ్రామిక కొనుగోలుదారులు కంపెనీల నుంచి నేరుగా కొనుగోళ్లు మానేసి పంపుల వైపు మళ్లుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి.ఈ మళ్లింపు పబ్లిక్ ఫ్యూయల్ ఔట్లెట్లపై తీవ్ర ఒత్తిడి పెంచిందని, పెరిగిన డిమాండ్‌తో సరఫరా సరిపోవడం లేదని పేర్కొన్నాయి.
5 రెట్లు పెరిగిన అమ్మకాలు
పౌరుల్లో ఏర్పడిన భయంతో దేశ వ్యాప్తంగా పలు చోట్ల రోజువారీ అమ్మకాలు ఐదు రెట్లు పెరిగాయి. ‘సాధారణంగా ద్విచక్ర వాహనదారులు రూ.100, రూ.200 పెట్రోల్ పోయించుకుంటారు. అయితే మంగళవారం నుంచి బంక్‌కు వచ్చిన వారిలో 95 శాతం ట్యాంక్ ఫుల్ చేయమనే అంటున్నారు. రోజూ వేసుకునే దానికన్నా నాలుగైదు రెట్లు భయంతో ఎక్కువ పోయించుకుంటున్నారు’ అని హైదరాబాద్‌లోని ఒక బంక్‌లో పెట్రోల్ పోసే యువకుడొకరు తెలిపాడు. దీని నివారణకు ప్రతి ద్విచక్ర వాహనదారుడికి రూ. 200, కార్ల వారికి రూ.2,000 పెట్రోల్ మాత్రమే పోసేలా పరిమితి విధించాలని ఆయన సూచించాడు.
కుక్కర్లు, పాల క్యాన్లల్లో..
చమురు కొరత ఏర్పడుతుందన్న భయంతో దేశంలోని పలు చోట్ల పౌరులు పెట్రోల్, డీజిల్‌ను వంటకు ఉపయోగించే పాత్రల్లో కూడా పోసుకుని తీసుకుపోతున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. పెట్రోల్ క్యాన్లు అందుబాటులో లేని వారు కుక్కర్లు, కిచన్ జార్, పాల క్యాన్లు, వాటర్ ట్యాంకర్లు, నీటి బకెట్లు, బ్యారెళ్లు, వంట పాత్రల్లో డీజిల్, పెట్రోల్‌ను నింపుకొని పోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాల్లో పెద్దయెత్తున తరలివస్తున్న పౌరులు వంట పాత్రల్లో సైతం చమురు నింపుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. అయితే ఇలా లూజుగా పెట్రో ల్, డీజిల్‌ను అమ్మవద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా క్షేత్ర స్థాయిలో వాటిని బంక్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.
భయంతోనే బంకుల వద్ద బారులు ; దేశంలో ఇంధనకొరత లేదు కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటన
దేశంలో పెట్రోల్, డీజిల్‌కు ఎటువంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. దేశంలో ముడి చమురు నిల్వలు తగినన్ని ఉన్నాయని తెలిపింది. పెట్రోల్ పంపుల్లో ఇంధన కొరత లేదని, వాటికి సరఫరా చేసే టెర్మినల్స్‌లో కూడా తగినన్ని ఇంధన నిల్వలు ఉన్నాయని శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ బుధవారం ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. భయాందోళనలతో పెట్రోల్, డీజిల్‌ని కొనుగోలు చేయవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక దొరకదేమోనన్న భయంతో ప్రజలు గత రెండు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారని ఆమె పేర్కొన్నారు. దేశం వద్ద తగినన్ని ముడి చమురు నిల్వలు ఉన్నాయని, భారత్‌కు ఏటా 26 కోట్ల టన్నుల చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉందని సుజాత శర్మ తెలిపారు.గడచిన 25 రోజుల్లో కొత్తగా 2.50 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చినట్లు సుజాత శర్మ తెలిపారు. అదనంగా 2.20 లక్షల మంది వినియోగదారులు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారిపోయారని ఆమె చెప్పారు. మరో 2.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఆమె వివరించారు.
ఆ ప్రచారం అవాస్తవం
దేశంలో ఎల్పీజీ కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వశాఖ తెలిపింది. ఆన్లైన్ బుకింగ్‌లు సజావుగా జరుగుతున్నాయని పేర్కొన్నది. ప్రస్తుత బుకింగ్ షెడ్యూల్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.