హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఇటీవల న్యాయమూర్తులపై విమర్శలు చేయడం, దూషించడం పరిపాటిగా మారిందని, ఈ ధోరణి పెరిగిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ మౌసమీ భట్టాచార్య పేర్కొన్నారు. అసంతృప్తికి గురైన అడ్వొకేట్లు, క్లయింట్లు జడ్జీలపై అభియోగాలు చేయడమే కాకుండా కేసు విచారణ నుంచి తప్పుకోవాలనే స్థాయికి దిగజారుతున్నారని తప్పుపట్టారు. ఈ చర్యలు స్వతంత్ర న్యాయమూర్తుల రక్షణను దెబ్బతీస్తాయని, అనిశ్చితికి దారితీస్తాయని వ్యాఖ్యానించారు. ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ న్యాయాన్ని అందించడంలో కోర్టులు కట్టుబడి ఉంటాయని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని భూవివాదంలో పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును గతంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్య కొట్టివేశారు. ఎలాంటి ఆధారం లేకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని తేల్చారు. తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని, తీర్పు చెప్పవద్దంటూ పిటిషనర్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. ఫిర్యాదుదారు పెద్దిరాజు ఈ పిటిషన్‌ను బదిలీచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన కేసులో న్యాయమూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. పెద్దిరాజుతోపాటు అడ్వొకేట్లు రితేశ్పాటిల్, నితిన్ మహేశ్‌పై సుమోటో కోర్టు ధికరణగా పరిగణించింది.
హైకోర్టులో కేసు రీఓపెన్ చేసి న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పాలని వారిని ఆదేశించింది. దీంతో శుక్రవారం ఆ ముగ్గురూ హైకోర్టుకు హాజరయ్యారు. క్షమాపణల అఫిడవిట్‌ను దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. తీర్పు చెప్పాక చెప్పవద్దని కోరడానికి వీల్లేదని స్పష్టంచేశారు. తీర్పును హేతుబద్ధంగా విమర్శించవచ్చునని, దురుద్దేశాలను ఆపాదించడానికి వీల్లేదంటూ పై విధంగా ఉత్తర్వులు జారీచేశారు. పిటిషనర్ల క్షమాపణలను న్యాయమూర్తి ఆమోదించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేయాలని పిటిషనర్లను ఆదేశించారు. సుప్రీంకోర్టు సీజేకు ధన్యవాదాలు తెలియజేశారు.