చిక్కడపల్లి, సెప్టెంబర్ 5: ‘వినాయకా మా మొర ఆలకించు. కాంగ్రెస్ సర్కార్ కండ్లు తెరిపించు’ అంటూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వినాయక విగ్రహానికి వినూత్న రీతిలో వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తంచేశారు. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పాలకుల కండ్లు తెరిపించాలని శుక్రవారం హైదరాబాద్ గాంధీనగర్లోని ఓ మండపంలో ఏర్పాటుచేసిన విగ్రహాన్ని జేఏసీ నేతలు వేడుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర నాయకుడు ఎం రవికుమార్ మాట్లాడారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని, జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. రాష్ర్టాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిందని, కానీ అమలులో ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న కాంగ్రెస్.. ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులకూ నియామక ప్రక్రియ మొదలే పెట్టలేదని విమర్శించారు. నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతిని ఇస్తామన్న హామీని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆచారణ ఈ ప్రభుత్వానికి లేనేలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా చూడు స్వామీ అని వారంతా వేడుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల తన వైఖరిని మార్చుకోవాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని నిరుద్యోగులు హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు విక్రమ్, రవి, రాము, లోకేశ్, నర్సింగ్, అమర్, కిరణ్, శ్రీకాంత్ తదితరలు పాల్గొన్నారు.