హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల అఫిడవిట్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ నియోజకవర్గ ఓటరు రాఘవేంద్రరాజు ఉపసహరించుకున్నారు. అందుకు హైకోర్టు అనుమతిస్తూనే ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.
నామినేషన్ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ సమర్పించిన అఫిడవిట్లో వాస్తవాలు వెల్లడించలేదన్న తన ఫిర్యాదుపై చర్యలు తీసుకునేలా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు ఇవ్వాలని రాఘవేంద్రరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదిస్తూ.. ఆ ఫిర్యాదుపై ఈ నెల 13న ఎన్నికల అధికారి చేపట్టిన చర్యల నివేదికను హైకోర్టుకు అందజేశారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని, తన పిటిషన్‌ను ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని కోరారు.