హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్ రాయాలంటే విద్యాశాఖ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సిందే. ఇలా అనుమతి పొందితేనే సరి.. లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తారు. టెట్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో పలువురు టీచర్లు టెట్ పరీక్షకు దరఖాస్తుచేయాలని భావిస్తున్నారు. ఇందుకు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాలా? లేదా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే విషయంపై టెట్ కన్వీనర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిని ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీయగా, టెట్ పరీక్షనే కాకుండా.. ఏ పరీక్ష రాయాలన్నా టీచర్లు విద్యాశాఖ నుంచి అనుమతిపొందాలని సూచించారు. టీచర్ల పదోన్నతులు కల్పించేందుకు టెట్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంగా పదోన్నతి పొందాలంటే టెట్లో క్వాలిఫై కావడం తప్పనిసరి అయ్యింది. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగార్థులతో పాటు ఈ సారి సర్కారీ టీచర్లు సైతం పదోన్నతులు పొందేందుకు టెట్ రాయబోతున్నారు. గతంలో టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునివ్వగా, దీనిని సవరించి ఇటీవలే ప్రభుత్వం టెట్ జీవోల్లో మార్పులు చేసింది.
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభంకానున్నది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయి. సందేహాల నివృత్తికి అభ్యర్థులు 70757 01768, 70757 01784 నంబర్లను సంప్రదించవచ్చు.