హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా 325 కిలోమీటర్ల రహదారి, 40 వంతెనల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో రానున్నాయని రోడ్లు భవనాలశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద గతంలోనే 698 కిలోమీటర్ల రహదారి మంజూరైంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు 325 కిలోమీటర్ల రహదారితోపాటు 40 వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిరుడు ప్రతిపాదించింది. కొత్తగా ప్రతిపాదించిన రహదారులు ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి.
అటవీశాఖ అనుమతులు ఆలస్యం..
ఇప్పటికే మంజూరైన 698 కిలోమీటర్ల రహదారి, 33 వంతెనలకుగాను 278 కిలోమీటర్ల రహదారి, ఏడు వంతెనల నిర్మాణం పూర్తయింది. అటవీశాఖ అనుమతుల ఆలస్యం కారణంగా 420 కిలోమీటర్ల రహదారి, 26 వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 300 కిలోమీటర్ల మేర రహదారులు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉన్నాయి. ఈ రహదారుల నిర్మాణానికి అటవీశాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే రెవెన్యూశాఖ భూమిని అప్పగిస్తుంది. ఈ పనులకు నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఖర్చు చేస్తాయి.