హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉన్నా.. దానిపై ప్రజల్లో భయం మాత్రం అంత కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఒమిక్రాన్‌పై అవగాహన కన్నా ఆందోళన ఎకువగా కనిపిస్తున్నదని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. థర్డ్‌వేవ్ వస్తుందనీ, మళ్లీ ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని భయపడుతున్నారని పేర్కొన్నాయి. ఇమ్యూనిటీని పెంచుకొనేందుకు కొందరు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారట. మరికొందరు థర్డ్‌వేవ్‌లో ఇంట్లోనే ఉండి ఏమేం చేయవచ్చని ఇంటర్నెట్లో వెతుకుతున్నారు.
భయమే ఎకువ..
కొవిడ్ సంబంధ సలహాలు, సూచనలు అందించే గుజరాత్‌కు చెందిన ఓ సంస్థ ఇటీవల ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఒమిక్రాన్ దేశంలోకి ప్రవేశించగానే కాల్స్ విపరీతంగా పెరిగాయని, మూడు వారాల్లోనే 2,200 మంది ఒమిక్రాన్‌పై సమాచారం, సహాయం అడిగారని పేర్కొన్నది.
ఒమిక్రాన్ పేరు వింటేనే భయపడుతున్నవారు-72%
కేసులు పెరుగుతున్న వార్తలు విన్నప్పుడల్లా ఆందోళన చెందుతున్నవారు-63%
ఫంక్షన్లకు వెళ్లడం మానేసినవారు-45 %
వీకెండ్ ప్లాన్లు రద్దు చేసుకుంటున్నవారు-15 %
రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినవారు-90 %
వెతుకులాట మారింది..
గూగుల్ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ప్రజలు థర్డ్ వేవ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తేలింది. సెలూన్‌కు బదులుగా ‘ ఇంట్లోనే జుట్టు కత్తిరించుకోడం ఎలా?’ అని ఎకువ మంది సెర్చ్ చేశారట. విహార యాత్రలకు బదులు ‘ఇంట్లో ఉండి ఏం చేయవచ్చు?’, ‘ఆన్లైన్ డెలివరీ’ గురించి ఎకువ వెతికారట. సినిమా థియేటర్లకు బదులు ఓటీటీ ల గురించి, సబ్స్రిప్షన్ ఫీజుల గురించి వెతికారని వెల్లడించింది.