BRS | ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ముంపు మండలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో రాజకీయ డ్రామాకు తెరలేపటం చర్చనీయాంశమైంది. ముంపు మండలాల్లో ఉన్న భద్రాచలం పరిధిలోని ఆ ఐదు పంచాయతీలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఏపీ పరిధిలో ఉన్న పిచుకులపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, ఎటపాక పంచాయతీలు తెలంగాణ ఏర్పడక ముందు భద్రాచలం మండల పరిధిలోనే ఉండేవి.
కానీ పోలవరం ముంపు సాకుతో ఆ ఐదు గ్రామాలను రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీలో కలిపారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు సమస్యలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అప్పటినుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో పోరాటం చేసింది. ఆనాడే అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దఎత్తున భద్రాచలంలో ఉద్యమం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.
అప్పటి వైసీపీ ప్రభుత్వంతో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడి బీజేపీ ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లారు. అప్పట్లో అన్నీ సానుకూలంగా ఉన్నా ఎన్నికలు రావడంతో అది మరుగునపడింది. కానీ.. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో తామే కలుపుతున్నామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నది. ఏపీ సీఎంకు లేఖలు రాసి ఇది తమ వల్లే సాధ్యమైందని గొప్పలు చెప్పుకోవటం మొదలుపెట్టింది.
ముంపు గ్రామాలను భద్రాచలంలో కలపాల్సిందే. డ్రామాలు ఆడటం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్తేమీకాదు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు.. కాబట్టి కచ్చితంగా అమలుచేయాలి. ఏపీ సీఎంకు మంత్రి తుమ్మల రాసిన లేఖను బహిర్గతం చేయాలి. ఇద్దరు సీఎంల భేటీ తర్వాత పోలవరం ముంపు గ్రామాలపై స్పష్టత ఇవ్వాలి. ముఖ్యంగా కరకట్ట విషయంలో రెండు ప్రభుత్వాలు అవగాహనకు వస్తే తప్ప నిర్మాణం పూర్తికాదు. లేకుంటే వరదలు వస్తే ముంపు తప్పదు. ఉద్యమాలకు వరదలే సాక్ష్యంగా నిలుస్తాయి.
– బండారి రవికుమార్, సీపీఎం రాష్ట్ర నాయకుడు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణలోని చాలా గ్రామాలు ముగినిపోతాయి. రైతులు, వ్యాపారులు, కూలీలు, సామాన్య ప్రజల జీవనం స్తంభించి దిక్కుతోచని పరిస్థితి దాపురిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల సీఎంలు విభజన హామీల పరిష్కారం దిశగా జరిగే సమావేశంలో ఈ విషయంపై చర్చ జరగాలి.
– కేవీ రమణ, బీఆర్ఎస్ నాయకుడు, బూర్గంపాడు