ఏటూరునాగారం/తాడ్వాయి: /గిర్మాజీపేట, జూలై 28: జంపన్న వాగు వరదలో గల్లంతయిన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామస్థుల కథ విషాదాంతంగా మిగిలింది. శుక్రవారం జంపన్న వాగు సమీపంలోని పంట భూములు, ఇసుక మేటల్లో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు కన్పించడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుల్లో కొండాయికి చెందిన ఎండీ మజీత్ఖాన్ (70), ఆయన భార్య లాల్‌బీ(65), రషీద్ (50), ఆయన భార్య కరీనా (42), షేక్ మహబూబ్‌ఖాన్(60), షరీఫ్(55), షరీఫ్ కుమారుడు అజార్ (22), దబ్బకట్ట సమ్మక్క (75) ఉన్నారు. శుక్రవారం ఉదయమే ఎస్పీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జంపన్న వాగు వద్దకు చేరుకున్నారు. కొండాయి సమీపంలో లభించిన మృతదేహాలను బోట్లలో గ్రామానికి చేర్చారు. అక్కడి నుంచి ఏటూరునాగారం దవాఖానకు తరలించారు. మల్యాల, కొండాయి గ్రామాల్లో ఉన్న ఆరుగురు గర్భిణులను కూడా అంబులెన్స్‌లో ఏటూరునాగారం తరలించారు. మేడారంలో జంపన్న వరదలో కొట్టుకుపోయి గుర్తు తెలియని యాచకుడు (50) మృతిచెందాడు. వరంగల్ రామన్నపేటలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం కాల్వలో పడి నరంశెట్టి శ్రీను(42) మృతిచెందాడు.
మధ్యాహ్నం ఫోన్లో మాట్లాడిన..
మా అమ్మానాన్న మధ్యాహ్నం నాతో మాట్లాడారు. బాగానే ఉన్నామని చెప్పారు. సాయంత్రం గల్లంతైనట్టు తెలిసింది. నిద్రపోకుండా వారినుంచి ఫోన్ వస్తుందని ఎదురుచూశా. కానీ, ప్రాణంలేకుండా చూడాల్సి వచ్చింది.
– రషీద్, కరీనాల కుమారుడు రక్
వరదలో కొట్టుకుపోతారనుకోలే
మా అమ్మానాన్నలు కొండాయిలో ఉంటారు. నేను ఏటూరునాగారంలో ఉంటా. వరద వస్తుందనగానే నేను వెళ్లడానికి ప్రయత్నం చేసినా. సాధ్యం కాలేదు. ఇద్దరు వరదలో కొట్టుకుపోయారు. అమ్మనాన్నలను ఒకేసారి కోల్పోయాను.
– మజీత్ఖాన్, లాల్‌బీ కుమారుడు వలిపాషా
నాతో ఉన్నా తాత బతికేవాడు
వరద వస్తుండగానే నన్ను మా తాతా జాగ్రత్తగా మల్యాలకు పంపించారు. అమ్మమ్మను తీసుకొని మల్యాలకు వస్తుండగా వరదలో కొట్టుకపోయారు. మాతాత నాతో ఉన్నా బతికేవాడే. నాకు అమ్మ లేదు. అమ్మమ్మ దగ్గరే పెరుగుతున్నా.
-సఫీనామ,హబూబ్ఖాన్ మనుమరాలు