రాష్ట్రంలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు షాక్ ఇచ్చారు. పలువురి స్వగ్రామాలతో పాటు పైలట్, దత్తత గ్రామాల్లోనూ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఓడిపోయారు.
నెట్వర్క్, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 17: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండంలోని పొక్కూర్ను ఆరు గ్యారెంటీల అమలుకు పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తుండటం, పైలట్ ప్రాజెక్టుగా ఎంపికవడంతో ఈ గ్రామంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. మూడో విడతలో భాగంగా బుధవారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఆకుదారి లక్ష్మిపై బీఆర్ఎస్ బలపర్చిన అయిత స్వరూప 9 ఓట్లతో విజయం సాధించడం గమనార్హం.
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి స్వగ్రామం అంకాపూర్‌లో ఆయన బలపరిచిన అభ్యర్థి రమణారెడ్డి ఓటమి పాలయ్యారు. స్వతంత్ర అభ్యర్థి దేవేందర్‌రెడ్డి 570 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి మల్లికార్జున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణ స్వగ్రామమైన కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి మహబూబ్ గెలుపొందారు. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ స్వగ్రామమైన కిసాన్‌నగర్‌లో బీఆర్ఎస్ బలపరచ్చిన అభ్యర్థి ఏనుగు రాంరాజ్గౌడ్ విజయం సాధించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి స్వగ్రామం నడ్కుడలో ఇండిపెండెంట్ నర్సయ్య గెలుపొందారు.
ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దత్తత గ్రామం, ఇందిరమ్మ ఇండ్ల పైలట్ గ్రామం బూరుగుపల్లిలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ బలపరిచిన యాకూబ్రెడ్డిపై 140 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి సంపత్ గెలుపొందారు.
ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ స్వగ్రామం తోషంతండాలో బీఆర్ఎస్ మద్దతునిచ్చిన జాదవ్ జితేందర్ 68 ఓట్లతో విజయం సాధించారు.
చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి స్వగ్రామం జనగామ నియోజకవర్గ పరిధిలోని నర్సాయపల్లి, అత్తగారి ఊరు జనగామ జిల్లా గంగాపురం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ రెండు గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రచారం చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. జనగామ జిల్లాలో కొమ్మూరి సతీమణి సొంతూరు గంగాపూర్‌లో రెండో విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి గెలుపొందారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో మూడో విడత ఎన్నికల్లోనూ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి సత్యనారాయణ 341 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
మోత్కూరు: తుంగతుర్తి నియోజకవర్గంలోని ఇందిరమ్మ పైలట్ ప్రాజెక్టు గ్రామమైన మానాయికుంటలో బీఆర్ఎస్ అభ్యర్థి దేశబోయిన నాగయ్య భారీ మెజారిటీతో గెలుపొందాడు. అత్యధిక వార్డులను బీఆర్ఎస్ గెలిచింది. కంచనపల్లిలో ఎమ్మెల్యే సామేల్ ప్రధాన అనుచరుడు చంద్రయ్యపై, బీఆర్ఎస్ బలపర్చిన చేడే అంబేద్కర్ గెలుపొందారు. మోత్కూరు మండలం సుదర్శాపురంలో బీఆర్ఎస్ మద్దతునివ్వడంతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం అభ్యర్థి మునుకుంట్ల నీలకంఠం 113 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పాలడుగులో బీఆర్ఎస్ బలపర్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి అంతటి భగవంత్ గౌడ్ 168 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాగిబావిలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మెండు శ్రీవాణి చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు.