హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మంగళవారం నిర్వహించిన చలో నల్లగొండ సభకు జనం పోటెత్తారు. అంచనాలకు అందని విధంగా ప్రజలు తరలిరావడంతో నల్లగొండ పట్టణం, నార్కట్పల్లి-అద్దంకి రహదారితోపాటు హైదరాబాద్-విజయవాడ హైవే సైతం కిక్కిరిసిపోయింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తొలి సభ సూపర్ గ్రాండ్సక్సెస్ కావడం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ బహిరంగసభల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. దీంతో ప్రజాస్పందన ఎలా ఉంటుందని రాష్ట్రం యావత్ ఆసక్తిగా చూసింది. పార్టీ నేతల అంచనాలకు సైతం అందని రీతిలో ఉదయం నుంచే జనప్రవాహం మొదలైంది. నల్లగొండ, తుంగతుర్తి, దేవరకొండ, మునుగోడు తదితర ప్రాంతాల నుంచి రైతులు ఎడ్లబండ్లు కట్టుకొని తరలివచ్చారు.
కొంతమంది ట్రాక్టర్లలో వచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వందలాది ఆర్టీసీ బస్సులు మంగళవారం మధ్యాహ్నానికే సభాప్రాంగణానికి చేరుకున్నాయి. చాలామంది ఇంటి నుంచే సద్దిమూటలు తెచ్చుకోగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత జిల్లాలతోపాటు చుట్టుపక్కల జిల్లాలైన వరంగల్, జనగామ నుంచి కూడా ప్రజలు తరలి రావడం విశేషం. నల్లగొండలో ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు పట్టించుకోలేదు. మిట్టమధ్యాహ్నానికే సభావేదిక నిండిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకల్లా నల్లగొండ చుట్టుపక్కల రోడ్లన్నీ ట్రాఫిక్ జాం అయ్యాయి. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు నడుచుకుంటూ సభావేదిక వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. సభ ముగిసిన తర్వాత కూడా మూడు, నాలుగు గంటలు నల్లగొండలో ట్రాఫిక్తోనే నిండిపోయింది.
నల్లగొండ సభకు ఎంతమంది వచ్చారన్నదానిపై ముఖ్యమంత్రి కార్యాలయం నిమిష నిమిషానికి ఆరాతీసినట్టు తెలిసింది. స్థానికంగా ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసు అధికారులు మేడిగడ్డలో ఉన్న ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు సమాచారం అందజేసినట్టు తెలిసింది. సభకు భారీగా జనం వచ్చినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినట్టు సమాచారం. నల్లగొండలో కేసీఆర్ సభ ముగిసిన తర్వాతనే మేడిగడ్డలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడం గమనార్హం. నల్లగొండ జిల్లాలో ప్రతిపక్ష పార్టీ సభకు ఇంత భారీ స్థాయిలో ప్రజలు తరలిరావడాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊహించలేదు.