ఆసిఫాబాద్/జైనూర్, అక్టోబర్ 18: ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్న అజ్మీరా శ్యాంనాయక్కు ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాకేంద్రానికి వచ్చిన గుండి గ్రామస్థులతో శ్యాంనాయక్ మాట్లాడేందుకు యత్నించగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. గ్రామస్థుల నిరసనతో శ్యాంనాయక్ తన మెడలో ఉన్న కాంగ్రెస్ కండువాను తీసేసి, సాధారణ వ్యక్తిలా నిలబడాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి జైనూర్ మండలం దబోళి గ్రామానికి ప్రచారానికి వెళ్లగా, గ్రామస్థులు అడ్డుకున్నారు. టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ కండువా వేసుకొని ఎలా ప్రచారం చేస్తావని నిలదీశారు. దీంతో చేసేదేమి లేక ఆయన వెనుదిరుగాల్సి వచ్చింది. వరుసగా ఎదురవుతున్న చేదు అనుభవాలు శ్యాంనాయక్తోపాటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ నిరాశ నింపుతున్నది.