భానుడి వేడిమికి ఇనుము కూడా కరుగుతున్నది. యూపీలోని నిగోహన్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు ఇలా ఎండవేడిమికి మెత్తబడి వంకరటింకరగా మారిపోయాయి. సకాలంలో గుర్తించిన లోకోపైలట్ ఆ పట్టాలపైకి రాకుండా నీలాంచల్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
Summer
Summer Effect | హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) / న్యూఢిల్లీ / లక్నో: దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో అధిక ఉష్ణోగ్రత, వడగాలులకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్..తదితర రాష్ర్టాల్లో వడగాలులకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. గత మూడు రోజుల్లో వడగాలుల కారణంగా యూపీ, బీహార్‌లో మొత్తం 98 మంది మృత్యువాత పడ్డారు. గత మూడు రోజుల్లో యూపీలోని ఒక్క బాలియా జిల్లాలో 400మంది దవాఖాన పాలయ్యారు. 54మంది చనిపోయారని అధికారిక సమాచారం వెలువడింది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, డయేరియాతో చనిపోయారని బాలియా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు. తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోలేకపోవటం..ఇతర అనారోగ్య సమస్యలతో వందలాది మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. హాస్పిటల్లో చేరుతున్నవారిలో అత్యధికులు 60ఏండ్లు దాటిన వృద్ధులే ఉన్నారని చెప్పారు. ఎండల తీవ్రతపై యోగి సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టకపోవటం, హాస్పిటల్స్‌లో చికిత్స అందుబాటులో లేకపోవటంతో యూపీలో మృతులు ఎక్కువగా ఉన్నారు.
ఇక బీహార్‌లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నది. ఒక్క రోజులో వడదెబ్బ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా 44 మంది చనిపోయారు. ఒక్క పాట్నా నగరంలోనే 35 మరణాలు నమోదయ్యాయి. పాట్నా సహా 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సీయస్ దాటింది. ఈనేపథ్యంలో జూన్ 24 వరకు పాఠశాలలు, విద్యాసంస్థల్ని మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మధ్యప్రదేశ్‌లో వేసవి సెలవుల్ని జూన్ 30 వరకు పొడగించారు.
రాగల మూడు రోజులపాటు 10 రాష్ర్టాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో వేడిగాలుల తీవ్రత పెరుగుతున్నదని వెల్లడించింది. వడగాడ్పుల నేపథ్యంలో బీహార్‌లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. జార్ఖండ్‌లో జూన్ 27 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గోవా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎండవేడిని దృష్టిలో ఉంచుకొని సెలవులను పొడగించారు. రాబోయే రోజుల్లో ఈశాన్య రాష్ర్టాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఎండ వేడిమి, ఉష్ణోగ్రతల తాకిడికి రైలు పట్టాలు సైతం మెత్తబడుతున్నాయి. లక్నో దగ్గర్లోని నిగోహన్ రైల్వే స్టేషన్ వద్ద శనివారం సాయంత్రం లూప్ లైన్ మీదకు నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు రాగా, మెత్తబడిన రైలు పట్టాలు పక్కకు జరిగాయి. రైలు తీవ్రమైన కుదుపులకు లోనైంది. లోకో పైలట్ అప్రమత్తతతో రైలును వెంటనే నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడి రైల్వే సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఒడిశా బాలాసోర్ దుర్ఘటన తర్వాత కూడా, లూప్ లైన్ల నిర్వహణను రైల్వే శాఖ సీరియస్‌గా తీసుకోవటం లేదని విమర్శలు వెలువడుతున్నాయి. ట్రాక్ నిర్వహణ సరిగా లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పట్టాలు పక్కకు జరిగిన విషయాన్ని లోకో పైలట్ గుర్తించకుంటే, ఒడిశా బాలాసోర్‌లో జరిగినట్టు మరో రైలు దుర్ఘటన జరిగి ఉండేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. రైల్వే ట్రాక్ నిర్వహణ సరిగా లేక అనేక రైళ్లు పట్టాలు తప్పుతున్నా, కేంద్రం దీనిపై దృష్టిపెట్టడం లేదన్న విమర్శలున్నాయి.
జూన్ నెల సగం గడిచినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఎండలకు వడగాడ్పులు తోడవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో మరో మూడు రోజులపాటు ఎండలు దంచికొడుతాయని, వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రాగల మూడు రోజులపాటు తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. మూడు రోజులపాటు అత్యవసరమైతే తప్ప పగటిపూట జనం ఇండ్ల నుంచి బయటికి రావద్దని సూచించింది. ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా రామగుండంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.