Telangana | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంపై భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఫలితంగా రికార్డుస్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. మరో నాలుగు రోజుల్లో 49కి చేరవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. వడగాడ్పులు వీస్తాయని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వైద్య, వాతావరణశాఖలు హెచ్చరిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల 46 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం 20 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిరుడు మే నెలతో పోల్చితే ఈ సారి 7.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం నుంచి శనివారం వరకు దీర్ఘకాల వడగాడ్పులు కొనసాగుతాయని భారతీయ వాతావరణశాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రావణి తెలిపారు.
రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేటలో 46.5, భద్రాద్రి-కొత్తగూడెంలో 46.5, ములుగులో 46.5, పెద్దపల్లిలో 46.4, జగిత్యాలలో 46.4, మహబూబాబాద్‌లో 46.3, కరీంనగర్లో 46.2, వరంగల్‌లో 46.2, మంచిర్యాలలో 46.2, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 45.3, జనగామలో 45.3, యాద్రాద్రి-భువనరిరిలో 45.6, నిర్మల్‌లో 45.5, జయశంకర్లో 45.5, మహబూబ్‌నగర్‌లో 45.4, హనుమకొండలో 45.1, సిద్దిపేటలో 45.1, నారాయణపేటలో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలంగాణ స్టేట్ ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ వెల్లడించింది.
రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. సోమవారం కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో అకడకడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గురువారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు కొనసాగాయి. శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అకడ వడగాడ్పులు వీస్తాయని చెప్పింది. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. 6 వరకు కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరిలో ఎండల తీవ్రత ఉంటుందని సూచించింది. 4 వరకు జార్ఖండ్‌లో, 3 వరకు కేరళ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది.