హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు అధిక మొత్తంలో చెల్లిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. ఏపీ కంటే తెలంగాణ ధనిక రాష్ట్రం అయినప్పటికీ ఆ రాష్ట్రంలో సా మాజిక పెన్షన్లు తక్కువగా ఇస్తున్నారని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో మంగళవారం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల చొప్పున సామాజిక పెన్షన్లు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చినా ఇప్పటికీ పాత పద్ధతిలోనే రూ.2 వేలు, దివ్యాంగులకు రూ.3 వేలు చెల్లిస్తున్నారని అన్నారు. వారసత్వంగా రూ.10 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు.