హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న హైదరాబాద్లో ‘మహాధర్నా’ నిర్వహించనున్నట్టు తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వెల్లడించింది. పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ధర్నాను పురస్కరించుకుని శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్నారాయణ, నరసరాజు మాట్లాడుతూ.. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 అక్టోబర్ 31 వరకు రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ ప్రయోజనాలు అందలేదని ఆరోపించారు.
చికిత్సలు, పిల్లల పెండ్లిళ్లు, పై చదువులకు డబ్బులు అందని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్థిక ఇబ్బందులతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్చేశారు. పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, మెరుగైన ఫిట్మెంట్ వర్తింపజేయాలని కోరారు. సమావేశంలో యాదయ్యగౌడ్, రవీందర్, నారాయణ, చంద్రశేఖర్, హరిందర్ తదితరులు పాల్గొన్నారు.