ఖైరతాబాద్, జూలై 1 : రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర మహిళా పెన్షనర్ల సంఘం చైర్పర్సన్ ఉమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం, ప్రజలకు సుధీర్ఘకాలం సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షన్ బెనిఫిట్ల జారీలో జాప్యం జరుగుతున్నదని, ఫలితంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్టు పేర్కొన్నారు.
‘75 ఏండ్లు దాటిన పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్‌ను వీడియోకాల్ ద్వారా గానీ, ప్రభుత్వ సిబ్బంది ద్వారా గానీ తెప్పించాలి. పెన్షనర్ల హెల్త్ స్కీం ద్వారా నగదురహిత చికిత్స అందించాలి. హెల్త్‌కార్డులు అందజేయాలి. పెండింగ్ డీఏ, పీఆర్సీపై ప్రభుత్వం స్పందించాలి.’ అని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం కో చైర్పర్సన్ ధనలక్ష్మి, పెన్షనర్ల సంఘం ప్రతినిధులు సుధాకర్, వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, లక్ష్మయ్య, చంద్రశేఖర్, రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.