హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ఆగస్టు 10 లోగా పరిష్కరించాలని పెన్షనర్స్ సంఘాల సమన్వయ కమిటీ సర్కారుకు డెడ్‌లైన్ విధించింది. లేకుంటే ఆగస్టు 11న చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తామని, మూడు లక్షల మంది పెన్షనర్దారులతో ఇందిరాపార్క్‌లో మహాధర్నాను నిర్వహిస్తామని అల్టిమేటం జారీచేసింది.
ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును పెన్షనర్ల సమన్వయ కమిటీ నాయకులు సోమవారం కలిసి ప్రభుత్వానికి నోటీసును అందజేశారు. పెన్షనర్లకు సంబంధించిన మొత్తం 10 డిమాండ్లను సర్కారు ముందుంచారు. ప్రభుత్వం స్పందించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 3 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని, తలా 15 మంది చొప్పున 45లక్షల మంది ఓటర్లను ప్రభావితం చేసి కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తామని ప్రతినబూనారు.
కాంగ్రెస్ సర్కారు తీరుతో విసిగిపోయిన 40 పెన్షనర్ల సంఘాలు ఏకమయ్యాయి. సంఘాలు, జేఏసీలు అన్ని కలిసి తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంఘాల సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, మహిళా పెన్షనర్స్ అసొసియేషన్ చైర్పర్సన్ ఆర్ ఉమాదేవి, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పీ కృష్ణమూర్తి సోమవారం సచివాలయం మీడియా సెంటర్లో మాట్లాడారు.
ఎన్నికలకు ముందు పెన్షనర్లకు ఎన్నో ఆశలు చూపి, హామీలిచ్చి, మ్యానిఫెస్టోలో పెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత తమను పూర్తిగా విస్మరించిందని వారు వాపోయారు. మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు వినతిపత్రాలిచ్చినా.. తమ సమస్యలపై చర్చించేందుకు ఐదు నిమిషాలు సమయమివ్వలేదని మండిపడ్డారు. 10 రోజులుగా సీఎస్ రామకృష్ణారావును కలిసేందుకు ప్రయత్నిస్తుంటే తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పైగా ఉద్యోగుల జేఏసీతో చర్చల్లో పెన్షనర్ల సమస్యలు ప్రస్తావనకు రాలేదని, పరిష్కారానికి నోచుకోలేదని, అంటే పెన్షనర్లను పూర్తిగా పక్కనపెట్టేశారా అంటూ వారు ప్రశ్నించారు. సర్కారు తీరు పట్ల పెన్షనర్లు ఆవేదన చెంది, నిరాశ నిస్పృహలకు లోనై ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమైనట్టు తెలిపారు. దీంట్లో భాగంగానే సోమవారం ప్రభుత్వానికి నోటీసు అందజేసినట్టు పేర్కొన్నారు. సమన్వయ కమిటీ నాయకులు తులసీ సత్యనారాయణ, డాక్టర్ అరుణ, భరత్‌రెడ్డి, రాజేంద్రబాబు, ధనలక్ష్మి, పుల్లయ్య, పెద్ది రమేశ్, మోహన్ నారాయణ, నరసరాజు, దేవేందర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.