హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): భారతదేశంలోని అసంఘటిత కార్మికులందరికీ సామాజిక భద్రత పెన్షన్ ప్రవేశపెట్టాలని ప్రపంచ ప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రొఫెసర్ సంతోష్ మెహ్రోత్రా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దేశంలో సుమారు 91 శాతం మంది కార్మికులు అసంఘటితరంగంలో పని చేస్తున్నట్టు చెప్పారు. కేవలం 12 శాతం మందే అధికారిక పెన్షన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) ఏడో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని సెస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 50 లక్షల మంది వృద్ధాప్య దశలోకి చేరుతున్నారని, 2040 నాటికి దేశం వృద్ధాప్య సమాజంగా మారబోతున్నదని, ఇది కొంత కలవరపెట్టే అంశమని చెప్పారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) ప్రకారం ప్రభుత్వాలు వారందరికీ సామాజిక బీమా భద్రత కల్పించాల్సి ఉన్నదని తెలిపారు. పేద అసంఘటితరంగ కార్మికులకు ప్రభుత్వం వాటాగా చెల్లించే సామాజిక భద్రత బీమాను అందించడానికి జాతీయ ఆదాయంలో(జీడీపీ) 0.69 శాతం లేదా రూ.137 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. సమావేశంలో సెస్ వ్యవస్థాపక సభ్యులు ప్రొఫెసర్ మహేందర్‌రెడ్డి, జీఆర్ రెడ్డి, డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు, అధికారులతోపాటు సెస్ అధ్యాపకులు, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్? ; సీఎం అంగీకరించారన్న ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపునకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించినట్టు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన శ్రీపాల్‌రెడ్డి గురువారం సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ముఖ్యమంత్రి ఆయనకు శాలువాకప్పి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ ఇవ్వాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ నాయకులు వెంకట్‌రెడ్డి, గుండు లక్ష్మణ్ పాల్గొన్నారు.