హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల పెన్షన్ సర్కారు ఇచ్చే భిక్షకాదని, తమ హక్కు అని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబ స్పష్టంచేశారు. సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఏఐఎస్జీఈఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా సుభాష్ లాంబ మాట్లాడుతూ బేసిక్ పేలో 50శాతం పెన్షన్ ఇచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, పూర్తి పెన్షన్ ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితి 10లక్షలకు పెంచాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థ రద్దుచేసి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఏకీకృత సర్వీస్‌రూల్స్ రూపొందించాలని, ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఉద్యోగుల సంక్షేమానికి కేసీఆర్ సర్కారు అవలంబించిన విధానాలపై సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది. కరోనా కాలంలో పెండింగ్‌లోని 18 నెలల డీఏ బకాయిలను కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది. జాతీయంగా తెలంగాణతో పాటు కేరళ రాష్ర్టాలు మాత్రమే ఉద్యోగులకు కరువుభత్యం చెల్లించాయి. మిగతా రాష్ర్టాలు కరోనాను సాకుగా చూపి డీఏలు చెల్లించలేదు. ఇదే విషయాన్ని ఈ సమావేశాల్లో జాతీయ నేతలు ప్రస్తావించినట్టు సమాచారం. ఇక కేంద్రం ఏటా పదేండ్లకోసారి పీఆర్సీ కమిషన్‌ను నియమించి వేతన సవరణ చేస్తున్నది. తెలంగాణ మాత్రమే ప్రతి ఐదేండ్లకోసారి పీఆర్సీ కమిషన్ వేసి వేతన సవరణ చేస్తున్నది.
తెలంగాణ తరహా కేంద్ర ప్రభుత్వం, మిగతా రాష్ర్టాలు కూడా పీఆర్సీ కమిషన్ వేయాలని సమావేశంలో తీర్మానించినట్టు తెలిసింది. ఏఐఎస్జీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి ఏ శ్రీకుమార్, 28 రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, డాక్టర్ ఎస్ఎం హుస్సేని (ముజీబ్), అసోసియేట్ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణగౌడ్, కస్తూరి వెంకటేశ్వర్లు, కే లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, శ్రీకాంత్, హరి, అశోక్ తదితరులు హాజరయ్యారు. కాగా మంగళవారం ప్రారంభమైన సమావేశాలు, బుధవారం ముగియనున్నాయి.