హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ ఉన్న 9 నెలల జీతాలను చెల్లించాలని వాణిజ్య పన్నులశాఖ డ్రైవర్లు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో తమ కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు. సర్కార్, సంబంధిత శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్యను పట్టించుకోవడం లేదని వాపోయారు. జీతాలు సమయానికి అందక కడుపు కాలి తాము ఆందోళన చేస్తుంటే సమస్య పరిష్కారం గురించి మాట్లాడాల్సిన అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఉచిత సలహా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లించకపోతే వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేస్తామని హెచ్చరించారు.
నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించాలి ; కలెక్టర్కు కాంట్రాక్టర్ల వినతి
హనుమకొండ, నవంబర్ 3 : పెండింగ్ బిల్లులను ఈ నెలాఖరులోగా చెల్లించాలని కోరుతూ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వరంగల్ కాంట్రాక్టర్లు సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహాశబరీష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిధిలో పూర్తయిన పనుల బిల్లులు పెండింగ్లో ఉండటంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులతో పాటు చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తే తాము పనులు నిలిపి వేస్తామని, ఇక ముందు పనులు చేయమని వినతిపత్రంలో పేర్కొన్నారు.