హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల పెండింగ్ డీఏలు విడుదల చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంగళవారం సచివాలయంలో సీఎస్ శాంతికుమారికి వినతిపత్రం అందజేశారు.
స్టాండింగ్ కౌన్సి ల్ సమావేశం నిర్వహించాలని, ఏపీ నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యోగులకు పోస్టింగ్ ఇచ్చి వేతనాలు చెల్లించాలని, పెండింగ్ డీఏలు, జీవో 317ను పునఃసమీక్షించాలని, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో కేంద్రసంఘం సహా అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, నగరశాఖ అధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి పంతులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.