Civil Contractors | హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ప్రజాప్రభుత్వమని చెప్పుకొనే కాంగ్రెస్ సర్కారు.. తమ నుంచి 20% కమీషన్లు వసూలు చేస్తున్నదని రాష్ట్రంలోని సివిల్ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసుకోవడానికి అంత మొత్తం ఎక్కడినుంచి తేవాలని మండిపడ్డారు. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టామని, వాటికి వడ్డీలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్న తమను 20% కమీషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇది ప్రజాప్రభుత్వం కాదని, 20% కమీషన్ సర్కార్ అని విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయిగానీ తమకు ఇవ్వడానికి లేవా? అని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా33 జిల్లాల నుంచి సుమారు 200 మంది చిన్న సివిల్ కాంట్రాక్టర్లు శుక్రవారం సచివాలయంలోని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క చాంబర్ ఎదుట ధర్నా చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చిన కాంట్రాక్టర్లకు భట్టి ముఖం చాటేశారు. కనీసం వారి వినతిని వినేందుకు కూడా ఇష్టపడలేదు. ఎస్పీఎఫ్ సిబ్బంది కాంట్రాక్టర్లను అడ్డుకోవడంతో వారంతా భట్టి చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు.
భట్టివిక్రమార్క పలాయనం
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది సివిల్ కాంట్రాక్టర్లు భట్టివిక్రమారను కలిసేందుకు శుక్రవారం మధ్యాహ్నం సచివాలయానికి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం భద్రతా సిబ్బందితోపాటు సచివాలయం సెక్యూరిటీ బాధ్యతలు చూసే ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా వీరిని అనుమతించలేదు. ఆగ్రహించిన కాంట్రాక్టర్లు భట్టి చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టుగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల ఆందోళనను గమనించిన భట్టి వారి దగ్గరికి వచ్చి భరోసా కల్పించాల్సింది పోయి.. సెక్రటేరియట్ నుంచి వెళ్ల్లిపోయారు.
బకాయిల కోసం తిరగాల్సిన పనిలేదు:భట్టి
ప్రభుత్వ ఉద్యోగులు వారి బకాయిల కోసం తిరగాల్సిన పనిలేదని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రూ.పదివేల కోట్ల బకాయిలను చెల్లించామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 14 నెలల కాలంలో కొన్ని బకాయిలు జమ చేశామని తెలిపారు. పాత, కొత్త పెండింగ్ బిల్లులు రూ.10వేల కోట్లు తమ ప్రభుత్వం క్లియర్ చేసిందని తెలిపారు. మరో రూ.8 వేల కోట్ల బకాయిలు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రాధాన్య క్రమంలో ప్రతినెలా రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని పేర్కొన్నారు.
బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలే!.. సివిల్ కాంట్రాక్టర్స్ సంఘం ఆవేదన
పెండింగ్ బిల్లుల కోసం మంత్రులను కలిస్తే, ఆ ఒక్క విషయం మాట్లాడొద్దని చెప్తున్నారని సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దర్శనాల శంకరయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. తల్లి, భార్య మెడలో ఉన్న బంగారం కుదువపెట్టి కాంట్రాక్టు పనులు చేశామని, బిల్లులు రాకపోవడంతో అప్పులపాలైన కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అసోసియేషన్ నాయకులు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ పెండింగ్ బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లతో సహా కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్ బిల్లులను ఈ నెల 20లోగా క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే, నిరసనలు, నిరాహారదీక్షలు, సచివాలయం ముట్టడి, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల ఘోష ప్రభుత్వానికి కనబడటం లేదా? అని ప్రశ్నించారు. తమకు అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదని వాపోయారు. అసోసియేషన్ సలహాదారు అజయ్మాట్లాడుతూ ఆర్అండ్బీ, పీఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, ఎస్డబ్ల్యూ తదితర శాఖల్లో రూ.10 లక్షలలోపు పనులు చేసిన కాంట్రాక్టర్లు సుమారు ఆరు వేల మంది ఉన్నారని, వీరికి చెల్లించాల్సిన బిల్లులు సుమారు రూ.500 కోట్లు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వంలోని ఓ పెద్దకు అడగ్గానే రూ.700 కోట్లు విడుదల చేశారని ఆరోపించారు.