హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి నుంచి అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లపై అవినీతి నిరోధకశాఖ కొరడా ఝులిపించింది. ఒక్కో ఆఫీసులో రోజుకు కనీసం రూ.2 లక్షల వరకు పథకం ప్రకారం దండుకుంటున్న వారిపై ఏసీబీ అధికారులు యాక్షన్‌కు దిగారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక మొదటి పేజీలో ‘పెన్సిల్ రాత.. కోట్లల్లో మేత’ శీర్షికన రిజిస్ట్రేషన్ ఆఫీసులలో జోరుగా సాగుతున్న వసూళ్ల దందాపై కథనం ప్రచురితమైంది. పెన్సిల్ రాత తో పేపర్‌పై మార్కింగ్ చేసి, సైన్ లాంగ్వేజ్‌తో వాటాలు పంచుకుంటూ రూ.కోట్లు జేబులు నింపుకుంటున్న వైనాన్ని బయటపెట్టింది. ప్రజల ముక్కుపిండి అదనంగా వసూలు చేస్తు న్న తీరును వెల్లడించింది. గతంలోనే ఏసీబీకి ఫిర్యాదులు వచ్చినా స్పందించలేదు. ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు కదిలారు. ఏసీబీ ఇన్చార్జి డీజీ చారుసిన్హా ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు
రెండుచోట్ల నగదు స్వాధీనం