హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గుడుంబా తయారీ, అమ్మకాలు, రవాణా చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్ ఆబ్కారీశాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైతే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, ములుగు, తొర్రూరు, మరిపెడతోపాటు నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్ తదితర ప్రాంతాల్లో గుడుంబా అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారం అందడంతో ఇద్దరు మంత్రులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లోని మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆబ్కారీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గుడుంబాతోపాటు గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, పోలీస్ , ఆబారీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తెలంగాణను గుడుంబా, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. నీరా పాలసీ పనులను వేగవంతంచేసి రెండు నెలల్లో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. సమీక్షలో ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు కమిషనర్ అజయ్‌రావు, జాయింట్ కమిషనర్ ఖురేషీ, డిప్యూటీ కమిషనర్లు అంజన్‌రావు, హరికిషన్, డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్ దత్తరాజుగౌడ్, చంద్రయ్యగౌడ్, రఘురామ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.