హనుమకొండ, జూలై 9 : రేవంత్‌రెడ్డి సర్కార్ రాష్ట్ర రైతులను ముంచే పనిచేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. ఎల్ నినో ప్రభావం రాష్ట్రంపై ఉందని ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులపై ఎలాంటి చలనం లేదని గురువారం విడుదల చేసిన ప్రకటనలో దుయ్యబట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు జలప్రదాయిని అయిన దేవాదుల ప్రాజెక్టు మూడు దశలను అద్భుతంగా పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం వరంగా ఇచ్చిందని గుర్తుచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగేండ్ల పాటు రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరందించారని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టులోని అన్ని మోటర్లు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల మోటర్లను ఆన్ చేసే ప్రయత్నం చేసిందని.. ఇంజినీర్లు, టెక్నికల్ సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మోటర్లను ఆన్ చేయడంతో విద్యుత్తు సరఫరా పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు.
అనాలోచిత నిర్ణయాలతో సాగునీటి ప్రాజెక్టులను ముందుకు సాగకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులను అరిగోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదుల గురించి హరీశ్‌రావు చెప్పిన విషయాన్ని సమర్థిస్తూ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లివ్వాలని చెప్పారని గుర్తుచేశారు. ఉమ్మడి వరంగల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు రైతులకు నీళ్లు ఇవ్వాలన్న సోయి, ప్రాజెక్టులపైన అవగాహన లేకపోవడం దురదృష్టకరమని ఎద్దేవాచేశారు. రైతులకు సాగునీరిస్తే బోనస్, రైతు భరోసా, యూరియా, పంటల కొనుగోలు చేయాల్సి వస్తుందనే రేవంత్ సరార్ ప్రాజెక్టులను వినియోయోగించడం లేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో పంట నష్టానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలని, లేకుంటే ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.