Peddavagu | ఖమ్మం, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల అంతులేని నిర్లక్ష్యం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు అపారనష్టం వాటిల్లింది. దశాబ్దాల చరిత్ర కలిగిన పెదవాగు ప్రాజెక్టు పరిధిలో 16,500 ఎకరాల ఆయకట్టు ఉండగా సుమారు 14 వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నది. తెలంగాణ ఏర్పాటు తరువాత ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించారు. ఆయకట్టు దామాషా ప్రకారం ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణ వంటి వ్యయంలో 80 శాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 20 శాతం తెలంగాణ ప్రభుత్వం భరించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు హెడ్‌వర్క్ తెలంగాణ పరిధిలో ఉండటంతో వీటి పర్యవేక్షణ తెలంగాణ జలవనరులశాఖ అధికారులు చూస్తున్నారు. అసలు విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ ఎగువ ప్రాంతంలో కొద్దిరోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో నీరు ప్రాజెక్టులోకి చేరి ఆనకట్టకు మూడుచోట్ల గండిపడింది.
అధికారులు సరైన అంచనా వేసి ముందే నీటి విడుదల చేసి ఉంటే ప్రమాదం తప్పేది. కానీ అలా జరగకపోవడంతో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. పొలాల నిండా ఇసుకమేట వేసింది. దాన్ని తొలగించడానికి ఎకరానికి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 20 శాతమే వాటా కలిగినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.20 కోట్లు మంజూరు చేయగా ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తిచేశారు. ప్రస్తుతం పెదవాగుకు గండిపడటంతో దాదాపు 12 వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అందులో 400 ఎకరాల వరి, 350 పత్తి, 50 ఎకరాలకుపైగా ఆయిల్‌పామ్ పంట దెబ్బతినగా మరో 300 ఎకరాల్లో ఇసుక మేట వేసినట్టు తెలుస్తున్నది. పొత్తూరు, బచ్చువారిగూడెం, నారాయణపురం, వద్దిరంగాపురం, ఖమ్మంపాడు తదితర ప్రాంతాల్లో అపారనష్టం సంభవించింది. పలుచోట్ల ఏపుగా పెరిగిన ఆయిల్‌పామ్ చెట్లు సైతం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి.