హైదరాబాద్, జూన్ 8(నమస్తే తెలంగాణ): హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్(హెచ్‌సీసీబీ) తెలంగాణలో తమ ఉత్పత్తి సామర్థ్యం విస్తరణలో భాగంగా రూ.700కోట్ల పెట్టుబడితో పెద్దపల్లి జిల్లాలో కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి, రాష్ట్ర అధికారులతో కలిసి అట్లాంటాలో హెచ్‌సీసీబీ ఫిస్కల్ పాలసీ హెడ్ జోనాథన్ రీఫ్‌తో సమావేశమైన సందర్భంగా వారు కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారని ఆయన తెలిపారు.
ప్లాంట్ ఏర్పాటుకు వారు స్థలాన్ని కూడా ఎంపిక చేసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కోకాకోలా టెక్నాలజీ గ్లోబల్ కెపాసిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని తా ము ప్రతిపాదించినట్టు మంత్రి తెలిపారు. నిరుడు ఆగస్టులో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన సందర్భంగా కోకాకో లా వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ మెక్ గ్రీవీ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు 1000 కోట్లతో సిద్దిపేటలో ఒక ప్లాంటు, అలాగే మరో 647 కోట్లతో కరీంనగర్/వరంగల్‌లో మరో ప్లాంటు ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నారు. అమీన్‌పూర్‌లోని కోకాకోలా ప్లాంటును 2022లోనే 142 కోట్లతో విస్తరించారు. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే తాజాగా కోకాకోలా 700 కోట్ల పెట్టుబడితో పెద్దపల్లిలో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.