సూర్యాపేట: ఒ లింగా, ఓ లింగా నామస్మరణతో సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి (Durajpalli) మారుమ్రోగుతున్నది. డిల్లెం బల్లెం చప్పుళ్లు, డోలు వాయిద్యాలు, కాళ్లకు గజ్జెల చప్పుళ్లతో హోరెత్తిపోతున్నది. ప్రతి రెండేండ్లకోసారి జరిగే, రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు శ్రీ లింగమంతులస్వామి జాతర (Peddagattu Jatara) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి దేవరపెట్టె చేరుకోవడంతో జాతర షురూ అయింది. యాదవులు సంప్రదాయ దుస్తులు ధరించి భేరీల చప్పుళ్లతో సందడి చేశారు. లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లలో పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జాతర భక్త జనసంద్రమైంది. భక్తులు గజ్జెల లాగులు ధరించి, కత్తులు, కటర్లు, డప్పు వాయిద్యాలతో గుట్ట పైకి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
జాతరలో కీలకమైన దేవరపెట్టె (అందెనపు చౌడమ్మ, లింగమంతుల స్వామి ఉత్సవ మూర్తులు)కు ఆనవాయితీ ప్రకారం కేసారం గ్రామంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవరపెట్టెను ఊరేగింపుగా ఆదివారం అర్ధరాత్రికి దురాజ్‌పల్లిలోని పెద్దగట్టుకు చేర్చారు. దీంతో జాతర ప్రారంభమైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. కేసారంలోని మెంతబోయిన వంశస్తులకు చెందిన దేవరగుడిలో దేవరపెట్టెకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మున్నా, గొర్ల, కులస్తులతోపాటు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. జాతర సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించారు. అదేవిధంగా జాతీయ రహదారి 65పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద మళ్లించి నల్లగొండ వైపుగా మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా విజయవాడకు మళ్లించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను కోదాడ వద్ద దారిమళ్లించి హుజూర్ నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు పంపిస్తారు.
ఐదు రోజుల జాతర..
ఐదు రోజులపాటు జరిగే జాతరలో రోజుకో ప్రత్యేకత ఉన్నది. తొలిరోజు గంపలను ప్రదర్శిస్తారు. భక్తులు తమ ఇండ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సంప్రదాయ ఆయుధాలు తీసుకుని గుడి చుట్టూ గంపల ప్రదక్షిణతో చేస్తారు. రెండోరోజు యాదవ పూజారులు పోలు ముంతలు, బొట్లు, కంకణ అలంకరణలు చేసి బోనం వండుకుని లింగమంతులస్వామికి నైవేద్యం సమర్పిస్తారు. చౌడమ్మ తల్లికి వర్ధ గొర్రె, తల్లి గొర్రె, బద్దేపాల గొర్రె, బోనాలు సమర్పిస్తారు.
ఇక మూడో రోజైన స్వామి వారి కళ్యాణంలో చంద్రపట్నం వేస్తారు. అనంతరం లింగమంతుల స్వామి, చౌడమ్మ బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి నాలుగు వైపులా ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. దేవరపెట్టెను ప్రతిష్టింపజేశారు. నాలుగో రోజు కేసారం నుంచి పాలు తీసుకొచ్చి రెండు కొత్త బోనం కుండల్లో పొంగిస్తారు. అనంతరం మాంసాన్ని వండుకొని తినడం ఆనవాయితీ. దిష్టిపూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్లి వచ్చే జాతరకు తీసుకొస్తారు.
చివరిదైన ఐదో రోజున మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకరతోరణం తొలగిస్తారు. దీంతో ఐదురోజుల పాటు జరిగే పెద్దగట్టు జాతర ముగుస్తుంది. శంభు లింగా అంటూ ఐదు రోజుల పాటు స్వామివారిని పూజించిన లింగమంతుల తిరిగి తమ తమ స్వగ్రామాలకు పయనమవుతారు.