Peddavagu | భద్రాద్రి కొత్తగూడెం, జూలై 19 (నమస్తే తెలంగాణ)/అశ్వారావుపేట రూరల్: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టుకు గురువారం అర్ధరాత్రి గండ్లు పడ్డాయి. రుణమాఫీ సంబురాల్లో మునిగి తేలిన పాలకులు ఇటువైపు కనీసం కన్నెత్తి చూడలేదు. 300 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. 100 ఎకరాల్లో వరి పంటలు, మరో 50 ఎకరాల్లో ఉద్యాన పంటలు కొట్టుకుపోయాయి. దిగువ గ్రామాల్లో ఇండ్లు నీటి మునిగాయి. రహదారులు కోతకు గురయ్యాయి. ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయి. విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. తాగునీరు, విద్యుత్తు సరఫరా లేక ఆయా గ్రామాల ప్రజలు రెండు రోజులుగా అల్లాడుతున్నారు.
మొత్తం మూడు గండ్లు
పెదవాగు ప్రాజెక్టుకు మూడు గండ్లు పడ్డాయి. 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గుమ్మడవల్లి సమీపంలో పెదవాగుపై ప్రాజెక్టు నిర్మించారు. 6 మీటర్లు (40 వేల క్యూసెకులు) నీటి సామర్థ్యం, 16 వేల ఎకరాల సాగు లక్ష్యం. గుబ్బలమంగమ్మ అటవీ ప్రాంతం, చుట్టూ ఉన్న కొండల నుంచి వచ్చే వర్షపు నీరే ఆధారం. 1984లో ఈ ప్రాజెక్టుకు ఒకసారి గండి పడింది. 2014లో రాష్ట్ర విభజన తరువాత అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామాల రైతులు దీని కింద 2,360 ఎకరాలు సాగు చేస్తున్నారు. బచ్చువారిగూడెం, మల్లాయిగూడెం చెరువులకు గండ్లు పడ్డాయి.
విద్యుత్తు శాఖకు భారీ నష్టం
నారాయణపురం-గుమ్మడవల్లి మార్గంలో 50కిపైగా విద్యుత్తు స్తంభాలు కూలిపడ్డాయి. పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. గుమ్మడవల్లిలోని 50 నివాసాల్లోని వరదనీరు చేరింది. జెట్టివారిగూడెంలో పాజెక్టు భవనాల్లో తలదాచుకున్నారు.
వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే, కలెక్టర్ పర్యటన
భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, అశ్వారావుపేట ఎమ్మెల్మే జారే ఆదినారాయణ గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. గుమ్మడవల్లి, కొత్తూరు, నారాయణపురం గ్రామాల్లో కూలిన ఇండ్లు, ఇసుక మేటలను పరిశీలించారు.
మరమ్మతులకు 10 కోట్లతో అంచనాలు
పెదవాగు ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు సుమారు రూ.10 కోట్ల నిధులు అవసరమని అంచనా వేస్తున్నట్టు భద్రాద్రి జిల్లా ఐబీ ఈఈ సురేశ్‌కుమార్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ నుంచి వరద ఉధృతి పెరగడం వల్లే గండి పడిందని, స్థానిక అధికారుల నిర్లక్ష్యం లేదని చెప్పారు. ప్రాజెక్టు సామర్థ్యం 40 వేల క్యూసెక్కులు కాగా.. ఎగువ నుంచి 80 వేల క్యూసెకుల నీరు వచ్చిందని తెలిపారు.