హైదరాబాద్, అక్టోబర్22 (నమస్తే తెలంగాణ): బీసీల రిజర్వేషన్ల సాధన కోసం నవంబర్ 24న కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర కార్యాలయాల ఎదుట గాంధీగిరి (శాంతియుత ధర్నా) కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీ బంద్‌లో పాల్గొని చేతులు దులుపుకుంటే సరిపోదని, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాక్షేత్రంలో రెండు జాతీయ పార్టీల నేతలు దోషిగా నిలబడక తప్పదని హెచ్చరించారు.
అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రధాని మోదీ, బీసీల రిజర్వేషన్ల అమలులో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్డీఏ, ఇండియా కూటమి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలని, అదొక్కటే మార్గమని స్పష్టంచేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, కుల సంఘాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పీట్ల శ్రీధర్, యాదవ హకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములుయాదవ్, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారోజు రత్నయ్యచారి, బీసీ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మేకల కృష్ణ, యాదవ కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొప్పాలి వెంకటేశ్‌యాదవ్, ఎంబీసీ కులాల రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల వీరన్న తదితరులు పాల్గొన్నారు.