తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్, భీమారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు నకిలీ పత్తి విత్తనాలను ( Spurious Seeds ) సరఫరా చేస్తున్న విక్రేతపై బుధవారం పీడీ చట్టాన్ని ( PD Act ) అమలు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ( Ambar Kishor Jha ) తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన వూస సుబ్బారావు రామగుండం కమిషనరేట్ పరిధిలోని తాండూర్, భీమిని, భీమారం, బెల్లంపల్లి- 2 టౌన్, తాళ్లగురిజాల, నెన్నెల, చెన్నూర్ మండలాల్లో ఏజెంట్లను నియమించుకుని నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఏడాదిలో వూస సుబ్బారావుపై రెండు కేసులు నమోదైనట్లు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా తాండూర్ సీఐ దేవయ్య, ఎస్సై ప్రసాద్ నిందితుడికి పీడీ ఉత్తర్వులను అందజేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. సీపీ మాట్లాడుతూ వూస సుబ్బారావు 2021 నుంచి 2025 వరకు ఐదు సంవత్సరాలుగా నకిలీ పత్తి విత్తనాల రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన అనేక క్రిమినల్ కేసుల్లో పాలుపంచుకున్నాడని వివరించారు.
నిందితునిపై ఈ నెల 10న పీడీ చట్టం అమలు చేయగా దానిని ప్రభుత్వం ధృవీకరించిందని పేర్కొన్నారు. పీడీ చట్టం అమలైన తర్వాత కూడా తన వైఖరిని మార్చుకోకుండా అదే తరహా నేరాలకు పాల్పడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జిల్లా, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో మొత్తం తొమ్మిది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో రెండుసార్లు పట్టుబడినట్లు వివరించారు. పీడీ చట్టం అమలుకు కృషి చేసిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, ఎస్సై ప్రసాద్‌ను సీపీ అభినందించారు.