Revanth Reddy | మహబూబ్‌నగర్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో నాగం జనార్దన్‌రెడ్డికి, కొల్లాపూర్ నియోజకవర్గంలో జగదీశ్వరరావుకు, వనపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి చిన్నారెడ్డికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాదని రేవంత్‌రెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ ఆయా నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సొంత జిల్లాలో తన వర్గాన్ని పెంచుకునే పనిలో భాగంగా సర్వేలను చూపించి సీనియర్ నాయకులను పక్కకు తప్పించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యూహం పన్నుతున్నారని తీవ్రంగా మండిపడుతున్నారు. మళ్లీ పోటీకి సిద్ధమవుతున్న ఓ మాజీ ఎంపీ కూడా కొత్తవారికి టికెట్లు ఇప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్లు తాను సూచించినవారికే ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతున్నది.
నాగర్‌కర్నూల్‌లో నాగంకు డౌటే!
నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డికి కాకుండా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓ చోటా నేతకు టికెట్ ఇస్తారంటూ రేవంత్‌రెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పార్టీలో తీవ్ర కాక పుట్టిస్తున్నది. దీంతో టికెట్ తనకు ఇవ్వకపోతే తడాఖా చూపిస్తానంటూ నాగం మీడియా సమావేశంలో హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఓ ఎమ్మెల్సీ తనయుడిని రంగంలోకి దింపేందుకు రేవంత్‌రెడ్డి వ్యూహరచన చేశారన్న ప్రచారం నాగం జనార్దన్‌రెడ్డి వర్గీయుల్లో అలజడి సృష్టిస్తున్నది.
మాజీ మంత్రి చిన్నారెడ్డికి చెక్
వనపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి చిన్నారెడ్డిని ఈసారి తప్పించేందుకు రేవంత్‌రెడ్డి వ్యూహం పన్నినట్టు ప్రచారం జరుగుతున్నది. చిన్నారెడ్డి 2018లో మంత్రి నిరంజన్‌రెడ్డి చేతిలో, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడిపోయారు. అధిష్ఠానంతో సంబంధాలు ఉన్న చిన్నారెడ్డి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని, టికెట్ ఇస్తే గెలిచే అవకాశం లేదంటూ ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఓ వర్గం ప్రచారం చేస్తున్నది. వీరికి మాజీ ఎంపీ ఆశీస్సులు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇదంతా రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతోనే సాగుతున్నదని చిన్నారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
జూపల్లి వస్తే తడాఖా చూపిస్తాం: జగదీశ్వర్‌రావు వర్గం
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడంతో అప్పుడే గ్రూపు విభేదాలు మొదలయ్యాయి. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న జగదీశ్వర్‌రావు, జూపల్లి రాకను వ్యతిరేకిస్తున్నారు. జూపల్లికి టికెట్ ఇస్తే తడాఖా చూపిస్తానని హెచ్చరించారు. దీంతో కొల్లాపూర్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది.
అసంతృప్తి సెగలు
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీలో సీనియర్లను, ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకున్న నేతలను కాదని నిన్న, మొన్న వచ్చిన నేతలకు ప్రాధా న్యం కల్పించడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నది. ఓ పథకం ప్రకారం సర్వేల పేరు చెప్పి అభ్యర్థులను మారుస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా పెడుతున్న పోస్టులు కాంగ్రెస్‌లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఇలా అయితే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.