మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/తిమ్మాజిపేట: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనని, లేదంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. ‘ఆ పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఒక న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. పీసీసీ చీఫే అప్రూవర్‌గా మారాక, నేరం అంగీకరించిన తరువాత ఇక ఎంక్వయిరీ ఎందుకు? చర్చ ఎందుకు? వారిపై వేటు వేయడానికి స్పీకర్‌కు మొహమాటం ఎందుకు? వెంటనే చర్యలు తీసుకోండి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మళ్లీ ఉల్టా పల్టా చేస్తే.. పీసీసీ అధ్యక్షుడి మాటలను సుప్రీంకోర్టు ముందు పెడతాం.. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని చెప్పారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి, దివంగత శ్వేత ప్రథమ వర్ధంతిలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో శ్వేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జడ్చర్లలో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, మీడియాను, కోర్టులను, చిన్నచూపు చూస్తున్నదని, వీళ్లతోటి చిలిపి ఆటలాడి తప్పించుకోవచ్చన్న ధోరణితో వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. గద్వాల జిల్లాలో పార్టీ మారిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు తాను ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితి ఉన్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కండువా వేసుకున్నాను.. బీఆర్ఎస్లో ఉన్నానంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గులాబీ పార్టీలోనే ఉంటే మరి ఎందుకు పార్టీ కార్యక్రమాలకు, శాసనసభాపక్ష సమావేశాలకు హాజరుకావడం లేదు? శాసనసభలో బీఆర్ఎస్ పక్షం వైపు ఎందుకు కూర్చోవడం లేదు? అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి తాను కాంగ్రెస్‌లో చేరానని స్పష్టంగా చెప్పారని.. ఇవన్నీ ఆన్ రికార్డు ఉన్నాయని పేర్కొన్నారు. వీరి మీద వెంటనే వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు.
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ను పూర్తి చేయాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు కంప్లీట్ చేయడం లేదని కేటీఆర్ నిలదీశారు. ఉమ్మడి జిల్లా ప్రజలు 12సీట్లు ఇచ్చి సీఎంను చేస్తే, ఈ జిల్లాకు చేసిందేమిటో చెప్పాలని నిలదీశారు. పాలమూరు జిల్లాను కోనసీమలా మార్చి పెం డింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. తాము 90% పాలమూ రు పనులను పూర్తి చేస్తే కూడా.. పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. పనులు పూర్తి చేస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరొస్తుందేమోనని కుట్ర రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇకనైనా రేవంత్‌రెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.