Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పొరపాటున నమ్మితే రాష్ర్టాన్ని అమ్ముకుంటాడని, ప్రజల నోట్లో మన్ను కొడతాడని పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు డాక్టర్ కురవ విజయ్‌కుమార్ విమర్శించారు. రేవంత్‌ది భస్మాసుర హస్తమని, ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీ పుంజుకుందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి వందల కోట్లకు టికెట్లు అమ్ముకున్నాడని, ఆయన బాగోతాలను దగ్గరుండి చూశానని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
కోట్ల రూపాయలు, భూములు రాయించుకొని రేవంత్‌రెడ్డి సీట్లు అమ్ముకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి కదా?
అవి ఆరోపణలు కాదు. వాస్తవాలు. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కొన్ని సీట్లు పక్కన పెడితే.. మిగతా అన్నీ స్థానాల్లో ఆ అభ్యర్థి ఎవరో ఇటు ప్రజలకు తెలియదు. అటు క్యాడర్‌కు తెలియదు. రూ.కోట్లు ఇవ్వకపోతే వాళ్లకు సీటెలా దక్కిందో మీరే ఆలోచించాలి.
నిజంగా ఈడీ విచారణ చేయాల్సిన స్థాయిలో సీట్ల పంపిణీలో లావాదేవీలు జరిగాయా?
కొన్ని వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. భూముల బదలాయింపు జరిగింది. పారాచూట్ నేతలకు టికెట్లు దక్కడమనేది ఉత్తగనే జరగదు కదా? ఎన్నో ఏండ్లుగా పార్టీలో ఉన్నవాళ్లని కాదని, గెలిచే వాళ్లను పక్కనబెట్టి కొత్తవాళ్లకు సీట్లు ఎలా ఇస్తారు? డబ్బులు తీసుకొని కదా. విచారణ చేస్తే నిజం బయటపడుతుంది.
కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ మిమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించారు. కారణం?
ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. ఇది ఎన్నికల సీజన్. రేవంత్‌రెడ్డికి మంచి బిజినెస్ టైమ్. ఆయన ఆడిన ఆటలు, వసూళ్లు అన్నీ దగ్గరుండి చూసినవాణ్ణి. వాస్తవాలు మాట్లాడుతుంటే తట్టుకోలేక పార్టీలోంచి సస్పెండ్ చేసి ఒక ముద్ర వేశారు.
రేవంత్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉన్నదని డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిజంగా మిమ్మల్ని చంపే కుట్ర జరుగుతున్నదా?
నాకు రేవంత్ అనుచరులు, ఆయన ప్రైవేట్ సైన్యం నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. రాత్రి సమయంలో ఇంటిచుట్టూ గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారు. బయటకు వెళ్తే నా కారును ఎవరో ఆగంతకులు ఫాలో అవుతున్నారు. ఆ ఫోన్ నంబర్లు, వెహికిల్ నంబర్లతో సహా అన్నీ వివరాలతో డీజీపీకి ఫిర్యాదు చేశా.
రేవంత్ వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నదా?
రేవంత్‌రెడ్డికి అంత సీన్ లేదు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కర్ణాటక ఎన్నికలు, రాహుల్‌గాంధీ యాత్ర, ఉప ఎన్నికల వల్ల కాంగ్రెస్ క్యాడర్లో పార్టీని బతికించుకోవాలనే చైతన్యం వచ్చి పార్టీ యాక్టివేట్ అయింది తప్పితే.. రేవంత్‌రెడ్డి వల్ల కాదు. ఆయనకు అంత దమ్మే ఉంటే.. మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో పార్టీకి డిపాజిట్ కూడా ఎందుకు రాలేదు?
ప్రజలు రేవంత్‌రెడ్డిని నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా?
కాంగ్రెస్ పార్టీలో తిరిగిన చాలామంది ఇప్పటికీ రేవంత్‌రెడ్డిని నమ్మరు. ప్రజలేం నమ్ముతారు. పొరపాటున ఆయన మాయమాటలు నమ్మి, టీవీల్లో, సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు, ఫొటోలు చూసి రేవంత్‌రెడ్డికి గనుక తెలంగాణను అప్పగిస్తే.. రాష్ర్టాన్ని అమ్ముకుంటడు. ప్రజల నోట్లో మన్ను కొడుతడు. కోట్లకు ఆశపడి సొంత పార్టీ నేతల గొంతు కోసిన రేవంత్‌రెడ్డి ప్రజల గురించి ఆలోచిస్తాడని, రాష్ర్టానికి ఏదో చేస్తాడని నమ్మొదు.
రేవంత్ కాంగ్రెస్‌ని మరో టీడీపీ చేస్తారనే వార్తలపై మీ కామెంట్?
ఆయన ఆరెస్సెస్ సుశిక్షిత కార్యకర్త. చంద్రబాబుకు నమ్మినబంటు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి టీడీపీలో కలపడమో, కాంగ్రెస్ పేరు మార్చి టీటీడీపీ అని పెట్టడమో చేస్తాడు. ఎన్నికల ఫలితాల తర్వాత ఏమాత్రం తేడా వచ్చినా ఆయన సీట్లు కేటాయించుకున్న కోటరీతో కొత్త పార్టీ పెడతాడు.
మొన్నటి వరకు మీరు పనిచేసిన పీసీసీలో ప్రెసిడెంట్ మీద ఇంతలా విమర్శలు, దాడి చేయడానికి కారణం?
రంగులు మార్చే ఊసరవెల్లిని నమ్మొచ్చు. రక్తం మరిగిన పెద్దపులిని నమ్మొచ్చు. కాటు వేసే విషనాగులను నమ్మొచ్చు. అవి పరిస్థితులను బట్టి, ఆకలిని, భయాన్ని బట్టి ప్రవర్తిస్తాయి. కానీ రేవంత్ అలా కాదు. తన అవసరాల కోసం ఎవరినైనా వాడుకుంటాడు. తను ఎదగడం కోసం ఎవరినైనా తొక్కేస్తాడు. రేవంత్‌ది భస్మాసురహస్తం. చేయందించాడని సంబరపడే లోపే.. బూడిదగా మారిపోతాం. ప్రస్తుతం ఎంతోమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆ బాధను అనుభవిస్తున్నారు. ఆ బాధితుల్లో నేనూ ఒకడిని. విమర్శ చేయకుండా, దాడి చేయకుండా ఎందుకుంటా?
మీకు టికెట్ ఇస్తే.. ఇవన్నీ బయటకు చెప్పేవారా?
చాలా మంచి ప్రశ్న అడిగారు. టికెట్ ఇస్తే చెప్పేవాడిని కాదేమో.. ఇవ్వలేదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నానేమో అని అనుకోవడం సహజం. ఈరోజు రేవంత్ గురించి మాట్లాడుతున్న వారంతా టికెట్ ఇవ్వలేదనో, మోసపోయామనో కాదు. గతంలో కూడా చాలా ఎన్నికల్లో టికెట్ రాలేదు. అవకాశాలు రాలేదు. కాంగ్రెస్ అనే పార్టీని వేదికగా చేసుకొని తనలోని ఫ్యూడలిస్టును బయటపెట్టాడు. పార్టీ నాయకులకే అన్యాయం చేస్తున్నాడు. రేపు ప్రజలను అమాయకులను చేసి.. అడుక్కు తినేలా చేస్తాడేమో అనే భయంతో చెప్తున్నా. దయచేసి తెలంగాణ ప్రజలందరికీ దండం పెట్టి చెప్తున్నా. రేవంత్‌రెడ్డిని, ఆయన మాటలను నమ్మొద్దు. ఒకవేళ గుడ్డిగా నమ్మితే.. నోట్లో మన్ను కొట్టి సర్వనాశనం చేస్తాడు.