హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఎన్ఐఐటీ (నిట్) ప్రొఫెసర్లు అధ్యాయనం చేసి, చీఫ్ ఇంజినీర్లకు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే షీట్ పైల్స్ బదులు సీకెంట్ పైల్స్‌ను వినియోగించామని కాళేశ్వరం కమిషన్ ఎదుట సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) విశ్రాంత ఎస్ఈ ఫజల్ వెల్లడించారు.
ఏకసభ్య కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజినీర్ల క్రాస్ ఎగ్జామినేషన్‌ను శుక్రవారం కూడా కొనసాగించింది. జస్టిస్ ఘోష్ ఎదుట సీడీవో విశ్రాంత ఈఎన్సీ నరేందర్‌రెడ్డి మరోసారి హాజరయ్యారు.
గురువారం విచారణ సందర్భంగా వెల్లడించిన అంశాలకు సంబంధించిన ఆధార పత్రాలను కమిషన్‌కు సమర్పించారు. అనంతరం సీడీవో విశ్రాంత ఎస్ఈ ఫజల్‌ను జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. బరాజ్‌ల డిజైన్లకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.