హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ-2024 టీచర్లకు వేతనాల చెల్లింపుపై సర్కారు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. టీచర్లంతా ఉద్యోగంలో చేరిన ఎనిమిది నెలలకు స్పష్టత ఇచ్చింది. కొత్త టీచర్లకు 2024 అక్టోబర్ 10 నుంచే వేతనాలివ్వాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. డీఎస్సీ-24 టీచర్ రిక్రూట్మెంట్లో భాగంగా 10వేలకుపైగా టీచర్లను సర్కారు నియమించింది. కొత్త టీచర్లందరికి 2024 అక్టోబర్ 10న అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి, వారం రోజులకు పోస్టింగ్స్ ఇచ్చారు. కొంత మంది టీచర్లు అక్టోబర్ 15న, మరికొందరు అక్టోబర్ 17న పాఠశాలల్లో చేరారు. విద్యాశాఖ మాత్రం అక్టోబర్ 10 నుంచే వేతనాలిస్తామన్నది. అయితే పనిచేయని కాలానికి వేతనాలు ఎలా ఇవ్వడమన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. పైగా కొత్త టీచర్లకు పోస్టింగ్ ఇచ్చిన స్థానాల్లో అప్పటికే కొందరు టీచర్లు పనిచేస్తున్నారు.
దీంతో ఒకే పోస్టుకు రెండు జీతాలు చెల్లించాల్సిన సమస్య తలెత్తింది. 2024 అక్టోబర్ 10తో నియామక ఉత్తర్వులిచ్చినా.. అక్టోబర్ 16 నుంచే వేతనాలు చెల్లించారు. నియామక ఉత్తర్వుల్లో ఒక తేదీ ఉండటం, జీతాలు మరో తేదీ నుంచి చెల్లించడంతో గందరగోళం నెలకొన్నది. ఇదే విషయంపై విద్యాశాఖ ఆర్థికశాఖ నుంచి స్పష్టత కోరింది. అప్పటి నుంచి నాన్చుతూ వచ్చిన ఆర్థికశాఖ తాజాగా అక్టోబర్ 10 నుంచి వేతనాల బిల్లులకు ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. అయితే 2024 అక్టోబర్ 10 నుంచి 16 మధ్య కాలానికి వేతనాన్ని చెల్లించాల్సి ఉంది. ఇందుకు సప్లిమెంటరీ బిల్లులు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ ఉత్తర్వుల విడుదలపై టీఎస్ యూటీఎఫ్ హర్షం వ్యక్తంచేసింది.