హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తమకు బకాయి పడిన రూ.3,151 కోట్లను వెంటనే చెల్లించాలని మద్యం సరఫరా కంపెనీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఆలోబెవ్ పరిశ్రమ సంఘాలు సీఐఏబీసీ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆలహాలిక్ బేవరేజెస్ కంపెనీస్), బీఐఏ (బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా), ఐఎస్డబ్ల్యూఏఈ (ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) గురువారం ప్రభుత్వానికి లేఖలు రాశాయి.
తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి చెల్లింపులు ఆగిపోవడంతో తమ పరిశ్రమలు సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది కిందటి బకాయిలు రూ.2,300 కోట్లు, తాజా బకాయిలు రూ.851 కోట్లతో కలిపి మొత్తం రూ.3,151 కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆలోబెవ్ అమ్మకాల ద్వారా గత ఏడాదిఎక్సైజ్ ఆదాయం రూ.38 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇది రాష్ట్ర ఆదాయంలో 32 శాతమని వివరించారు. రాష్ట్ర ఖజానాకు స్థిరమైన, అత్యధిక ఆదాయం మద్యం కంపెనీలు సంక్షోభం ఎదుర్కొంటున్నట్టు వారు లేఖలో పేర్కొన్నారు.