హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : దోపిడీలకు పాల్పడుతున్న క్రిమినల్ గ్యాంగ్‌లపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. గురువారం డీజీపీ కార్యాలయంలో క్రైమ్ రివ్యూ ముగింపులో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో దారుణంగా పెరిగిపోతున్న దోపిడీలు, దొంగతనాలు, డ్రగ్స్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. క్రిమినల్ గ్యాంగ్‌ల నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తమ యూనిట్ల పరిధిలోని క్రిమినల్ గ్యాంగ్‌లపై నిఘా పెట్టాలని స్పష్టంచేశారు. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, తదనుగుణంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ ఎం భగవత్ మాట్లాడుతూ.. పార్దీ గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్, భవేరియా వంటి గ్యాంగ్‌ల కదలికలను తెలుసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాల విషయంలో అవసరమైతే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ కట్టడికి నైజీరియన్లను అరెస్టు చేస్తున్నట్టు టీన్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా చెప్పారు. ఈ సమావేశంలో సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా, ఎక్సైజ్ డైరెక్టర్ షానావాజ్ ఖాసీం, మహిళా శిశు సంక్షేమశాఖ సెక్రటరీ అనిత, పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా, అడిషనల్ డీజీలు వీవీ శ్రీనివాసరావు, స్వాతి లక్రా, అనిల్‌కుమార్, సంజయ్‌కుమార్ జైన్, స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, మల్టీ జోన్ల ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తా, ఆగస్టు 7 : కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో విద్యాబుద్ధులు చెప్పాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓ పీజీ విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తోటి విద్యార్థుల ముందు తనను ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్యకరంగా అభివర్ణిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నాడని సైకియాట్రీ పీజీ విద్యార్థిని ప్రిన్సిపాల్ సంధ్యకు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిన ప్రిన్సిపాల్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ మూడు రోజుల క్రితం బాధిత యువతితో పాటు సైకియాట్రీ విభాగం పీజీ విద్యార్థులను ప్రాథమికంగా విచారించింది. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ని సైతం విచారించింది. నివేదిక ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.