కొడిమ్యాల, మల్యాల జనవరి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రానున్న అన్ని ఎన్నికల్లో.. అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని, అందుకు తగ్గట్టుగా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్పష్టంచేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని ఓ రిసార్ట్‌లో 400 మంది పార్టీ కార్యకర్తలతో పవన్‌కల్యాణ్ స మావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయంగా ఎదగడానికి 10 ఏండ్ల సమయం పట్టిందని తెలిపారు. ఓడిపోయిన నేతలు బాధపడకూడదని, గెలిచిన వాళ్లు పార్టీ బలోపేతం కోసం కష్టపడాలని సూచించారు. అంతకుముందు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలోని హెలిప్యాడ్ వద్ద మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సత్యప్రసాద్ పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికారు. ఎస్పీలు పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు సహా సుమారు1200 మంది పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు.
ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ
కార్యకర్తలతో సమావేశం తర్వాత పవన్‌కల్యాణ్ కొండగట్టుకు వెళ్లారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మేడిపల్లి సత్యంతో కలిసి అంజన్న ఆలయంలో పూజలు చేశారు. రూ.31.35 కోట్లతో 96 గదుల ధర్మశాల నిర్మాణం, రూ.3.84 కోట్లతో 2200 మంది భక్తులు ఏకకాలంలో దీక్ష విరమించేలా మండప నిర్మాణం కోసం టీటీడీ బోర్డ్ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2009లో ఎన్నికల ప్రచారంలో కరీంనగర్లో విద్యుత్ ప్రమాదం జరుగగా.. కొండగట్టు ఆంజనేయస్వామే తనను రక్షించారని అన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంజన్న దర్శనానికి వచ్చినప్పుడు వసతి గదులు, మండపం ఏర్పాటుకు చొరవచూపాలని అధికారులు, భక్తులు కోరినట్టు గుర్తుచేశారు. కార్యక్రమంలో ఏపీ శాసనమండలి విప్ హరిప్రసాద్, టీటీడీ పాలకమండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.