ఖిలావరంగల్, జనవరి 2: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌లో త మను విలీనం చేయొద్దని కోరుతూ సేవాలాల్ సేన, లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పత్తినాయక్ తండావాసులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ సర్కారు, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ జిల్లా సేవాలాల్ సేన అధ్యక్షుడు కునుసోతు మురళీనాయక్ మాట్లాడుతూ రెండువేల మందితో జీపీ గా ఉన్న పత్తినాయక్తండాను ఎమ్మెల్యే సొంత గ్రామమైన అమీనాబాద్‌లో విలీనం చేసేందుకు గత డిసెంబర్ 31న గ్రామసభ పేరుతో పోలీసులు, కాంగ్రెస్ నాయకులు, అధికారుల తో సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సభలో ప్రజలు విలీనాన్ని తిరస్కరించారని చెప్పారు. ‘మా తండాలో మా రాజ్యం’ పేరు తో బీఆర్ఎస్ ప్రభుత్వం జీపీలు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. అనంతరం కలెక్టర్ సత్య శారదకు వినతిపత్రం సమర్పించారు.