సుల్తాన్‌బజార్,నవంబర్ 12. ఉస్మానియా దవాఖానలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ మె డికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో గంట పాటు విధులను బహిష్కరిం చి.. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా వేతనాలందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. జీతా లు చెల్లించకపోవడంతో విధులకు ఎలా హాజరుకావాలని ప్రశ్నించారు.
పిల్లల స్కూలు ఫీజులు, రవాణా చార్జీలు, ఇంటి అద్దెలు చెల్లించకలేక సతమతమవుతున్నామని వాపోయారు. ఉద్యోగుల జీత భత్యాలకు చెందిన బిల్లులు ప్రతినెలా 5లోపు సంస్థల కాంట్రాక్టర్లకు దవాఖానలోని పరిపాలనా విభాగం కిందిస్థాయి అధికారిణి పంపించకపోవడంతో ఈ దుస్థితి నెలకొన్నదని ఆరోపించారు. రెండేండ్లుగా మూడు ఏజెన్సీల పరిధిలో 225 మంది విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. అనంతరం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్ను కలిసి సమస్యను వివరించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. రెండురోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీతో ఆందోళన విరమించారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన నిర్వహిస్తామని ఉద్యోగులు తెలిపారు.