అడ్డగుట్ట, సెప్టెంబర్ 11: హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో విధులు నిర్వహిస్తున్న మహిళ వైద్యురాలిపై దాడికి పాల్పడ్డాడో రోగి. బన్సీలాల్ పేట ప్రాంతానికి చెందిన ప్రకాశ్ అనే వ్యక్తిని అతని భార్య చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తీసుకొచ్చింది. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో క్యాజువాలిటీ వార్డులో విధులు నిర్వహిస్తున్న జూనియర్ మహిళా డాక్టర్ల వద్దకు ప్రకాశ్ వచ్చి.. ఓ వైద్యురాలిపై దాడిచేశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన సహచర వైద్యులు వెంటనే తేరుకొని అతడిని పక్కకు నెట్టేశారు. చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. జూనియర్ డాక్టర్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రకాశ్ మానసికస్థితి సరిగా లేదని, దాడిచేసిన సమయంలో మద్యం మత్తులో ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. కాగా గాంధీలో జూనియర్ డాక్టర్లకు రక్షణ కరువైందని, ఘటనపై వెంటనే స్పందించాలని జూనియర్ డాక్టర్స్ అసోషియేషన్ దవాఖాన సూపరింటెండెంట్ రాజకుమారిని కోరారు.